తెలంగాణ

telangana

ETV Bharat / state

Medaram jathara 2022: జన సంద్రంగా మారిన మేడారం.. నేడు అమ్మవార్ల వన ప్రవేశం - Medaram Sammakka Saralamma

Medaram jathara 2022: మేడారం మహా జనజాతర ముగింపు ఘట్టానికి చేరుకుంది. వనం నుంచి వచ్చిన దేవతలు.. ఈ రాత్రి తిరిగి వన ప్రవేశం చేయడంతో నాలుగు రోజుల వన వేడుక పరిసమాప్తం అవుతుంది. గద్దెల వద్ద భక్తుల నిర్విరామ దర్శనాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోపాటు పలువురు ప్రముఖులు వన దేవతలను దర్శించుకోనున్నారు.

Medaram jathara 2022: జన సంద్రంగా మారిన మేడారం.. నేడు అమ్మవార్ల వన ప్రవేశం
Medaram jathara 2022: జన సంద్రంగా మారిన మేడారం.. నేడు అమ్మవార్ల వన ప్రవేశం

By

Published : Feb 19, 2022, 5:26 AM IST

Updated : Feb 19, 2022, 6:41 AM IST

Medaram jathara 2022: జన సంద్రంగా మారిన మేడారం.. నేడు అమ్మవార్ల వన ప్రవేశం

Medaram jathara 2022: వన జాతర భక్తజన సాగరమైంది. మేడారం వీధులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బుధవారం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెకు చేరుకోగా.. గురువారం సమ్మక్క తల్లి కొలువు దీరింది. నలుగురూ గద్దెలపై ఆశీనులవడంతో శుక్రవారం వన దేవతల నిండు జాతరకు జనం పోటెత్తారు. క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. జంపన్నవాగు తీరమంతా భక్త ప్రవాహమైంది. ఇప్పటి వరకు కోటి మందికి పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. దర్శనాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఒడిశా నుంచి భక్తులు తరలివచ్చారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, రేణుకా సింగ్‌, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మల్లారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ తదితర ప్రముఖులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశ ప్రధాని కావాలని మొక్కుకున్నానని మంత్రి మల్లారెడ్డి చెప్పారు.

గిరిజన వర్సిటీకి రూ. 45 కోట్లు: కిషన్‌రెడ్డి..

ఆదివాసీ సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం మేడారం జాతర అని కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. కరోనా నుంచి ప్రపంచానికి విముక్తి కలిగించాలని అమ్మవార్లను కోరుకున్నట్లు తెలిపారు. అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘కేంద్ర ప్రభుత్వం ములుగులో ఏర్పాటు చేయనున్న గిరిజన యూనివర్సిటీకి రూ.45 కోట్లు కేటాయించింది. పనులు ప్రారంభిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తాం. ఈ ప్రాంతానికి ట్రైబల్‌ సర్క్యూట్‌ కింద నిధులు మంజూరు చేసి కాటేజీలు, హోటళ్ల నిర్మాణం పూర్తిచేశాం. బిర్సాముండా జయంతిని ఆదివాసీ హక్కుల దినోత్సవంగా నిర్వహిస్తున్నాం. రూ.15 కోట్లతో హైదరాబాద్‌లో ట్రైబల్‌ మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తున్నాం’’ అని తెలిపారు. కుంభమేళా తర్వాత అంతపెద్ద జాతర మేడారమే అని కేంద్ర గిరిజన శాఖ సహాయమంత్రి రేణుకా సింగ్‌ అన్నారు. ఇక్కడికి వచ్చి సమ్మక్కసారలమ్మలను దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.

నేడు వనప్రవేశం..

గద్దెలపై కొలువుదీరి మొక్కులు అందుకుంటున్న అమ్మవార్లు శనివారం సాయంత్రం వనప్రవేశం చేయనున్నారు. ఇవాళ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోపాటు పలువురు ప్రముఖులు వన దేవతలను దర్శించుకోనున్నారు. వన దేవతలను రెండేళ్లకోసారి ఘనంగా స్వాగతించడం, గద్దెలపై ప్రతిష్ఠించి మొక్కులు సమర్పించడం, నాలుగో రోజు వన ప్రవేశం చేయించడం ఆదివాసీ సంప్రదాయం. అమ్మవార్ల వన ప్రవేశంతో మేడారం మహాజాతర ముగుస్తుంది.

సీఎం రాకకు నేతల ఎదురుచూపులు..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం నాటి మేడారం పర్యటన రద్దయింది. ఆయన రాక కోసం యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ చేసింది. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు మేడారం చేరుకున్నారు. తొలుత మధ్యాహ్నం 12 గంటలకు సీఎం వస్తారని చెప్పారు. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు వస్తారని ప్రచారం చేశారు. చివరకు పర్యటన రద్దయింది.

ప్రజలు ప్రశ్నిస్తారనే ముఖ్యమంత్రి రాలేదు: సంజయ్‌

గత జాతర్ల సమయంలో ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, వాటిపై ప్రజలకు సమాధానం చెప్పలేకనే కేసీఆర్‌ మేడారానికి రాలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ఈ జాతరకు రాకపోవడం అంటే గిరిజనులను అవమానించడమేనని, వారికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. శనివారమైనా మేడారం రావాలన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ ధరలు పెంచిందని.. త్వరలోనే ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపనుందని అన్నారు.

ఇదీ చూడండి: Medaram jathara 2022: పెద్దమ్మ ఆగమనం.. భక్తజన పారవశ్యం

Last Updated : Feb 19, 2022, 6:41 AM IST

ABOUT THE AUTHOR

...view details