Medaram Jathara 2022: తెలంగాణ కుంభమేళ మేడారం జాతర కీలక ఘట్టానికి చేరుకుంది. వనం వీడి జనం మధ్యకు అమ్మవార్లు చేరుకున్నారు. నిన్న పగిడిద్దరాజు, గోవిందరాజు సమేతంగా సారలమ్మ గద్దెలపై కొలువుదీరగా.. నేడు సమ్మక్క గద్దెను చేరుకుంది. డప్పు వాద్యాలు, జయజయ ధ్వానాలు, శివసత్తుల పూనకాల నడుమ ఊరేగింపుగా చిలకలగుట్ట నుంచి మేడారానికి వచ్చి గద్దెపై కొలువుదీరింది. సమ్మక్కకు స్వాగతం పలుకుతూ గౌరవసూచకంగా ములుగు ఎస్పీ గాల్లోకి కాల్పులు జరిపారు. సమ్మక్కకు వేల సంఖ్యలో భక్తులు స్వాగతం పలికారు. సమ్మక్క వచ్చే మార్గంలో భక్తులు పొర్లు దండాలు పెట్టారు.
జనసంద్రంగా మేడారం..
సమక్క ఆగమనంతో మేడారం పరిసరాలు భక్త జనసంద్రంగా మారాయి. అమ్మ గద్దెపైకి చేరే అద్భుతాన్ని కనులారా వీక్షించిన భక్తకోటి పరవశించిపోయారు. సమ్మక్క తల్లి గద్దెల వద్దకు చేరుకోవడంతో కాసేపు దర్శనాలు నిలిపివేశారు. పూజారులు సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు చేసిన అనంతరం దర్శనాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. రేపు, ఎల్లుండి భక్తుల దర్శనార్థం వనదేవతలు గద్దెలపైనే ఉంటారు. జాతరకు భక్తులు పోటెత్తారు. నిలువెత్తు బంగారంతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇసుకేస్తే రాలనంత జనం ఉండటంతో.. పరిసరాలు కోలాహలంగా మారాయి. మేడారం పరిసరాల్లో ఎటు చూసిన గుడారాలు వెలిశాయి. భక్తి పారవశ్యంతో ఉప్పొంగుతుండగా.. కోరిన కోర్కెలు తీర్చి చల్లగా చూడాలని దేవతల్ని కోరుకుంటున్నారు.