గోదావరి జలాలతో తాగు, సాగునీటికి ఇబ్బందులు ఉండవని తీర ప్రాంత ప్రజలు మురిసిపోయారు. కానీ ఆ గోదారమ్మ పచ్చని పంట పొలాలను ప్రతి ఏటా తనలో కలుపుకుంటోంది. భూమిని నమ్ముకొని ఎన్నో ఆశలతో అప్పు తెచ్చి.. పెట్టుబడి పెట్టిన రైతుకు నిరాశే మిగులుతోంది. పంట పచ్చగా ఉన్నప్పుడు గోదారి ఉద్ధృతికి నీటిపాలవుతోంది. ములుగు జిల్లాలోని మంగపేట మండల కేంద్రం సమీపం నుంచి పవిత్ర గోదావరి ప్రవహిస్తోంది. వర్షాకాలంలో ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు నది ఉద్ధృతంగా ప్రవహించడంతో ఒడ్డు కోతకు గురవుతోంది. రైతుల కళ్లెదుటే పచ్చని పొలాలు గోదావరిలో కలిసిపోతున్నాయి. గంపోనిగూడెం, మంగపేట, పొదుమూరు గ్రామాలకు చెందిన సుమారు 50 మంది రైతుల పంట భూములు వరద ఉద్ధృతికి విలవిల్లాడుతున్నాయి. రెండు దశాబ్దాలుగా రైతులు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు.
కరకట్ట నిర్మాణం ఎప్పుడు..
వర్షాకాలంలో గోదావరి నిండుగా ప్రవహించడంతో పొదుమూరు గ్రామస్థులను.. అధికారులు మంగపేట, కమలాపురం పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. దీంతో గోదావరి ప్రవాహం పెరిగినప్పుడల్లా పొదుమూరు ప్రజల ఆందోళనకు అంతులేదు. కమలాపురం సమీప సీతమ్మ గుడి నుంచి మంగపేట పుష్కర ఘాట్ వరకు సుమారు మూడు కిలోమీటర్ల పొడవున పంటపొలాలు కోతకు గురవుతున్నాయి. దీంతో లక్షల రూపాయల విలువచేసే పంటపొలాలు నదిలో కలిసిపోతున్నాయి. గోదావరి ఒడ్డుకు కరకట్టల నిర్మాణం చేపట్టాలని సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులకు స్థానికులు మొరపెట్టుకుంటూనే ఉన్నారు. అయినా కరకట్ట నిర్మాణానికి మోక్షం కలగలేదు.
ఎండాకాలం నెర్రెలు పారిన భూమి అంతా.. వర్షాకాలంలో కొట్టుకోతోంది. కరకట్టలు నిర్మిస్తామని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. కానీ ఇంతవరకూ నిర్మాణం చేపట్టలేదు. మాకు పునరావాసం కల్పించాలని వేడుకుంటున్నాం. -శ్రీనివాస్, పొదుమూరు
పగిలిన పుష్కర ఘాట్
గోదావరి ఉద్ధృతికి రూ. కోట్ల రూపాయలతో నిర్మించిన పుష్కర ఘాట్ సైతం ముక్కలైంది. ఘాట్ పై భాగంలోని బీట్ రోడ్డు నదిలో కలిసిపోయింది. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం 2015లో పుష్కర ఘాట్ నిర్మించింది. గోదావరి పుష్కరాల సమయంలో ఇక్కడికి వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. పుష్కరాల సమయంలో జన సందడి నెలకొంటుంది. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం భావించింది కానీ పుష్కరఘాట్.. మళ్లీ పుష్కరాలు రాకముందే పూర్తిగా శిథిలమైంది.
2016 సెప్టెంబర్ 26 న అప్పటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, గిరిజన శాఖ మంత్రి అజ్మీర చందూలాల్, ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ.. మంగపేట పుష్కరఘాట్ పైభాగంలో కోతకు గురవుతున్న పంట భూములను పరిశీలించారు. పుష్కర ఘాట్ పంటభూములు కోతకు గురికాకుండా కరకట్ట నిర్మిస్తామని హామీ ఇచ్చారు. దీంతో బాధిత ప్రజలు తమ కష్టాలు తీరుతాయని సంబరపడ్డారు. ఐదేళ్లు దాటిపోతున్నా వారి హామీ నోటి మాటకే పరిమితమైంది. నిర్మాణం దిశగా ఒక్క అడుగూ పడలేదు.