పర్యటక తీరాన అధికారులు, స్థానికులకు కయ్యం! ములుగు జిల్లాలో లక్నవరం సరస్సుకు వెళ్లాలంటే గుంతల మయంగా మారిన రోడ్డు.. చెట్ల కింద పర్యాటకులు వదిలేసిన వ్యర్థ పదార్థాలు కుప్పలు కుప్పలుగా కనిపిస్తున్నాయి. వాటిని తొలగించాలని బుస్సాపూర్ గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బుస్సాపూర్ వాసులకు, అటవీ అధికారులకు మధ్య వివాదం నడుస్తోంది. ఎన్నో ఏళ్లుగా చెక్‌పోస్ట్ పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న అటవీశాఖ అధికారులే ఆ పనులు నిర్వహించాలని కోరుతున్నా.. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా దుమ్మూ ధూళితోపాటు చెత్తా చెదారం నిండి, దుర్వాసన వస్తోందని ఆందోళన చెందుతున్నారు.
వసూలు చేసినప్పటికీ..
లక్నవరం సరస్సు కొంతమేర అటవీ శాఖ వారి అదుపులో ఉండటం వల్ల చెక్ పోస్ట్ పెట్టి.. వస్తున్న పర్యాటకుల వాహనాలకు ద్విచక్ర వాహనానికి రూ.20, ఆటోకు రూ.50, కార్లు, జీపులకు రూ.100, బస్సులు, లారీలు, జేసీబీలకు రూ.200, చొప్పున వసూలు చేస్తున్నారు. పర్యాటకుల వద్ద డబ్బులు వసూలు చేసినప్పటికీ రోడ్ల మరమ్మతు పనులు, పారిశుద్ధ్యం లాంటి పనులను వదిలేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
పూర్తిగా అప్పగించాలి..
ఈ తరుణంలో అటవీశాఖ అధికారులు పర్యాటకుల నుంచి డబ్బులు వసూలు చేసుకుంటున్నారు తప్ప.. అభివృద్ధి పనులకు డబ్బులు ఖర్చు పెట్టడం లేదని బుస్సాపూర్ గ్రామస్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తమకు ప్రత్యేక చెక్‌పోస్టు ఇవ్వాలని జిల్లా పాలనాధికారిని కోరారు. ఫలితంగా గత నెల 24న కలెక్టర్ ఆ గ్రామస్థులకు పర్యాటకుల నుంచి డబ్బులు వసూలు చేసి.. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అనుమతి ఇచ్చారు. ఈ తరుణంలో అటవీ శాఖ సిబ్బందికి, గ్రామస్థులకు మధ్య గొడవలు ఏర్పడుతున్నాయి. రోడ్డు నిర్మాణం, చెత్త తొలగింపు, గ్రామ అభివృద్ధి కోసం చెక్ పోస్ట్‌ను గ్రామ పంచాయతీకి పూర్తిగా అప్పగించాలని వారు వేడుకుంటున్నారు. లేనిపక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు.
ఉపాధి కూడా..
అక్కడ జింకల పార్కు నిర్మాణానికి భూమలు ఇచ్చిన తొమ్మిది మందికి ఉద్యోగం కల్పిస్తామని అటవీ అధికారులు ఆశ చూపించి.. తొమ్మిది నెలలుగా జీతం ఇవ్వకుండా పనులు చేయిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది నవంబర్ మొదటి వారంలో పర్యాటకం తిరిగి ప్రారంభమైనప్పటికీ.. తమలో నలుగురిని మాత్రమే పనుల్లోకి తీసుకున్నారని తెలిపారు. మిగతా ఐదుగురిని విధుల్లోకి రానివ్వకుండా ఇతరులను తీసుకున్నారని వాపోయారు. ప్రస్తుతం భూమి కోల్పోవడంతోపాటు ఉపాధి కూడా కోల్పోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు తమని గుర్తించి.. తొమ్మిది నెలల జీతంతోపాటు జీవన భృతి కల్పించాలని వేడుకుంటున్నారు.
ఇదీ చూడండి : గురుకులాల్లో కరోనా అలజడి.. విద్యార్థులపై కొవిడ్ గురి