పోడు భూముల వ్యవహారం ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను అటవీశాఖ సిబ్బంది అడ్డుకోగా.. వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ గొడవలో ఆదివాసీలకు, అటవీసిబ్బందికి గాయాలయ్యాయి. ఈ ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలం జలగలంచ గూడెంలో జరిగింది. జలగలంచగూడెంలో నివసిస్తున్న గుత్తికోయలు ఎన్నో ఏళ్ల నుంచి పోడు భూములపై ఆధారపడి వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈరోజు ఉదయం ఓ గిరిజనుడు పొలాన్ని దున్నుతుండగా అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తింది. ఈ ఘర్షణలో ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు.
గిరిజనులకు గాయాలు
ఈ గొడవలో గుత్తికోయ గూడెం పెద్దమనిషి సోమయ్యతో పాటు మరికొందరికి గాయాలయ్యాయి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోత్ బాలకృష్ణ, బేస్ క్యాంప్ డ్యూటీ బీట్ ఆఫీసర్ నాగేంద్రబాబు సైతం గాయపడ్డారు. ఈ ఘటనతో గుత్తి కోయ గిరిజనులు, అటవీశాఖ అధికారులు తాడ్వాయి పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పనులు చేయించుకుని మమ్మల్నే కొడుతున్నారు: గిరిజనులు