ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధిగాంచిన మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ప్రతి రెండేళ్లకు ఒకసారి తెలంగాణ కుంభమేళాగా పిలుచుకునే మేడారం మహా జాతర వచ్చేఫిబ్రవరి 16, 17, 18, 19 తేదీల్లో నిర్వహించనున్నారు. అక్కడ కొలువైన సమ్మక్క, సారలమ్మ దర్శనానికి.. కోట్లాది మంది భక్తులు తరలివస్తారు. అయితే మేడారం వెళ్లే ప్రధాన రహదారులు మరింత అధ్వానంగా తయారయ్యాయి.
ఎక్కడ చూసినా గుంతలు పడి, చెదిరిపోయి, అస్తవ్యస్థంగా మారాయి. పట్టు తప్పితే ఎక్కడ ప్రాణాలు గల్లంతు అవుతాయోనని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. మేడారం వెళ్లేందుకు భక్తులు ప్రధానంగా పస్రా-మేడారం, చిన్నబోయినపల్లి మేడారం, భూపాలపల్లి మేడారం, కాటారం మేడారం, తాడ్వాయి మేడారం.. ఉపయోగిస్తారు. కానీ ఈ రహదారులే మరమ్మతులకు గురయ్యాయి. కొన్ని చోట్ల రహదారికి ఇరువైపులా పిచ్చి మొక్కలు పెరిగి ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.
పస్రా-మేడారం
ఈ రహదారిని జాతర సమయంలో ప్రైవేటు వాహనాలు వెళ్లేందుకు వినియోగిస్తారు. గతంలో ఇటువైపు ఇసుక లారీలు నడవడంతో ఈ రహదారి పూర్తిగా ధ్వంసమైంది. మేడారం సమీపంలో 200 మీటర్ల వరకు రహదారి పూర్తిగా కోతకు గురైంది.
తాడ్వాయి-మేడారం
14 కిలోమీటర్ల ఈ రహదారిని జాతర సమయంలో ఆర్టీసీ బస్సులు, వీఐపీల కోసం వినియోగిస్తారు. ఈ మార్గంలో రహదారికి ఇరువైపులా పిచ్చి మొక్కలు పెరిగి ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదు.
కాటారం-మేడారం
ఈ రహదారి 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. జాతర సమయంలో కరీంనగర్, ఆదిలాబాద్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి ప్రైవేటు వాహనాలు మేడారం వచ్చేందుకు ఈ మార్గాన్ని వినియోగిస్తారు. ఈ దారిలో కాటారం సమీపంలోని మాంటిస్సోరి స్కూల్ పక్కనే పెద్ద గుంత ఏర్పడింది. సుబ్బక్కపల్లి సమీపంలో మిషన్ భగీరథ పైపులు అమర్చే సందర్భంగా రహదారిని తవ్వడంతో కందకాలు ఏర్పడ్డాయి. కొర్లకుంటలో సైతం పలుచోట్ల మరమ్మతులకు గురైంది. యామన్ పల్లిలో చెరువు మధ్య నుంచి రహదారి వెళుతుంది. కానీ దారికి ఇరువైపులా ఎలాంటి రక్షణ గోడలు లేకపోవడంతో ప్రమాదభరితంగా మారింది. సింగారం-కాల్వపల్లి మధ్యన సైతం అక్కడక్కడ గుంతలు అయ్యాయి.
భూపాలపల్లి-మేడారం
55 కిలోమీటర్లు ఉంటుంది. జాతర సమయంలో ప్రైవేటు వాహనాలు అన్ని భూపాలపల్లి రహదారి గుండానే తిరుగుముఖం పడుతాయి. ఈ దారిలోనూ గుంతలేర్పడ్డాయి. పలుచోట్ల చెట్లు రోడ్లమీదకు వంగి ప్రమాదకరంగా ఉన్నాయి. గొల్ల బుద్ధారం సమీపంలో రహదారి ఛిద్రమైంది.