తెలంగాణ

telangana

ETV Bharat / state

Special Story: కాళ్లు కోల్పోయాను.. కనికరించండయ్యా! - వ్యాన్ డ్రైవర్ నాగరాజుపై స్పెషల్ స్టోరీ

Special Story on Van Driver Nagaraju: జీవితం చాలా చిన్నది. ఈ చిన్ని జీవితంలో ఎవరికైనా కష్టాలు సహజం. కానీ అతని కష్టాలు చెప్పుకోలేనివి. ఇది ఒక వ్యాన్ డ్రైవర్ దీనగాథ. వ్యాన్ డ్రైవర్​గా జీవనం సాగిస్తున్న అతడిని చూసి విధి ఓర్వలేక పోయింది. అతని కుటుంబాన్ని కాటేసింది. అనుకోకుండా జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాన్ని అగాథంలోకి నెట్టేసింది. అతను రోడ్డు ప్రమాదంలో మృత్యువుతో పోరాడి గెలిచినా.. తన రెండు కాళ్లు కోల్పోవాల్సి వచ్చింది. దిక్కుతోచని స్థితిలో ఉన్న అతనికి కనీసం వికలాంగుల పింఛన్ కూడా రావట్లేదు.

Special Story
Special Story

By

Published : Apr 30, 2023, 2:02 PM IST

Special Story on Van Driver Nagaraju: విధి ఎంతో విచిత్రమైనది. ఏ క్షణాన ఎవరిని కాటేస్తుందో అస్సలు తెలియదు. దీనికి నిదర్శనమే ఈ వ్యాన్‌ డ్రైవర్‌ నాగరాజు దీనగాథ. వచ్చే కొద్దిపాటి సంపాదనతో ఆనందంగా జీవనం సాగిస్తున్న నాగరాజు కుటుంబాన్ని చూసి విధికి కన్నుకుట్టి కాటేసింది. అనుకోకుండా జరిగిన ఓ రోడ్డు ప్రమాదం నాగరాజు కుటుంబాన్ని అగాథంలోకి నెట్టేసింది. రోడ్డు ప్రమాదంలో మృత్యువుతో పోరాడి గెలిచినా.. నాగరాజు తన రెండు కాళ్లను కోల్పోవాల్సి వచ్చింది. దిక్కుతోచని స్థితిలో ఉన్న నాగరాజు కనీసం వికలాంగుల పింఛనుకు నోచుకోక తన గోడును ఈటీవీ భారత్​తో వెళ్లబోసుకున్నాడు.

వివరాల్లోకి వెళితే..: ములుగు జిల్లా గోవిందరావుపేట గ్రామంలోని తారకరామ కాలనీకి చెందిన వ్యాన్‌ డ్రైవర్‌ శనిగరపు నాగరాజు(27) 30వ తేదీ జనవరి 2022 రోజు తెల్లవారుజామున హైదరాబాద్‌ బీబీ నగర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తన రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు. రవాణా ఖర్చులు, ఆసుపత్రి ఖర్చులు, ఇతరత్రా ఖర్చుల నిమిత్తం పాడి గేదెలతో సహా అన్నీ అమ్ముకోవాల్సి వచ్చింది. రెండు నెలల అనంతరం కోలుకుని ఇంటికి చేరుకున్న డ్రైవర్ నాగరాజు.. తన పోషణ మీదే ఆధారపడిన కుటుంబాన్ని చూసి ఎలా నెట్టుకురావాలో తెలియక విషాదంలో మునిగిపోయాడు.

కనీసం పింఛన్​ అయినా మంజూరు చేయండి..: నాగరాజు తమ్ముడు శ్రీకాంత్ అన్న కోసం తన చదువును త్యాగం చేసి మరీ ఇంటి వద్ద ఉండి నాగరాజుకు సపర్యలు చేసుకుంటూ వస్తున్నాడు. కళాశాల ఫీజు మొత్తం చెల్లించకపోవడంతో విద్యా సంస్థ శ్రీకాంత్​కు ఇంటర్మీడియట్‌ మెమోను సైతం ఇవ్వడానికి నిరాకరించింది. వృద్ధుడైన అతని తండ్రి లింగయ్య పనులకు వెళ్లే పరిస్థితి లేదు. నాగరాజు భార్య లావణ్య తనకు తెలిసిన కుట్టు మిషన్​ పనితో ఎలాగోలా కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఈ నేపథ్యంలో తనకు కనీసం పింఛన్‌ అయినా మంజూరు చేయాలంటూ నాగరాజు ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నాడు.

కృత్రిమ కాళ్ల విషయంలో సాయం చేస్తే.. నా కుటుంబాన్ని కాపాడుకుంటా..: అయితే కొత్తగా నమోదు చేసుకున్న వారందరికీ ఒకేసారి పింఛన్లు ఇవ్వడం ప్రారంభిస్తామని పైఅధికారులు తెలిపారు. కృత్రిమ కాళ్ల ఏర్పాటుకు అవకాశముందని తెలుసుకున్న నాగరాజు.. హైదరాబాద్‌ వెళ్లగా ఉచితంగా అమర్చడం సాధ్యపడదని.. దీనికి కనీసం రూ.3 లక్షలైనా చెల్లిస్తేనే ఓ మోస్తరు నాణ్యత కలిగిన కృత్రిమ కాళ్లను అమర్చడం జరుగుతుందని వైద్యులు చెప్పడంతో అక్కడ కూడా ఆ కుటుంబానికి నిరాశే ఎదురయ్యింది. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో తన భార్య లావణ్య, పిల్లలు సాయి దీపిక (4), లక్కీ (2)ల భవిష్యత్తు గురించి బెంగపడుతూ.. బతుకు వెళ్లదీస్తున్నానని నాగరాజు కన్నీరుమున్నీరయ్యాడు. తనకు వికలాంగ పింఛను కల్పించి, దాతలెవరైనా కృత్రిమ కాళ్ల విషయంలో సాయం చేస్తే.. తన కుటుంబాన్ని కాపాడుకుంటానని నాగరాజు చెబుతున్నాడు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details