రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే మేడారం జాతరలో భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. రాష్ట్రం నుండే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుండి లక్షల్లో భక్తులు వస్తుంటారు. అమ్మవార్ల దర్శనం కోసం దూరప్రాంతాల నుండి వచ్చిన వారు గుడారాలు వేసుకొని మూడు, నాలుగు రోజుల పాటు ఇక్కడే ఉంటారు. జాతరకు వచ్చే భక్తుల కోసం అధికారులు చేపడుతున్న నీటి సౌకర్యాలు సరిపోక భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
జాతర కోసం అధికారులు కట్టించిన మంచినీటి సిమెంట్ ట్యాంక్లు నీరు లేక వెలవెలబోతున్నాయి. అక్కడక్కడ ఉన్న చేతిపంపుల వద్ద నీటికోసం తీవ్ర పోటి నెలకొంది. గంటల కొద్ది క్యూలైన్ కట్టినప్పటికీ బిందెడు నీటి కోసం ఇతరులతో వాగ్వాదాలు, తోపులాటల వరకు పరిస్థితి వస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్యాంకర్ వాహనాలు ఎప్పుడో ఒక్కటి మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. బయటి దుకాణాలలో వాటర్ క్యాన్లను ఇష్టారీతి ధరల్లో అమ్ముతున్నా.. భక్తులు తప్పనిసరి పరిస్థితులలో కొనుగోలు చేస్తున్నారు.