ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సు నిండుకుండలా మారింది. ఎగువన కురిసిన భారీ వర్షాలకు నీటి మట్టం 27 అడుగులకు చేరుకుంది. గతంలో ఈ సమయానికి సరస్సు అందాలను చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేవారు. ఈసారి కరోనా వైరస్ కారణంగా రాలేకపోతున్నారు. రెండో వంతెన నిర్మాణంతో సరస్సు అందాలు మరింత మెరుగుపడ్డాయి. వాటిని తిలకించాలని అనిపించినా... అటవీశాఖ అధికారులు అనుమతించడం లేదు.
లక్నవరం సరస్సు అందాలపై కరోనా ప్రభావం - లక్నవరం సరస్సుకు లేని పర్యాటకుల తాకిడి
కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లక్నవరం సరస్సు నిండుకుండను తలపిస్తోంది. గతంలో సరస్సు అందాలను తిలకించేందుకు పర్యాటకులు కోకొల్లలుగా చేరుకునేవారు. కాని కరోనా కారణంగా పర్యాటకులు లేక వెలవెలబోతోంది.
లక్నవరం సరస్సు అందాలపై కరోనా ప్రభావం
సరస్సులో బోటు సౌకర్యం నిలిపివేశారు. పర్యాటకులకు ఆహారం మంచినీరు, తినుబండారాలు పెట్టె హరిత హోటల్ సేవలు కూడా నిలిపివేశారు. ఎవరైనా దారి తప్పి వస్తే బయటి నుంచి తెచ్చుకోవాలి తప్ప ఇక్కడ దొరకడం మాత్రం కష్టమే. అరకొరగా వచ్చిన పర్యాటకులు శానిటైజర్లు, మాస్కులు ధరించి త్వరితగతిన వీక్షించి వెనుదిరుగుతున్నారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో 50 వేలు దాటిన కరోనా కేసులు