తెలంగాణ

telangana

ETV Bharat / state

నీటమునిగిన వరి, పత్తి పంటలు.. అన్నదాతల అగచాట్లు - mulugu district news

రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని రోజులుగా కురుస్తున్న అధిక వర్షాలకు ప్రాజెక్టులు జలకళను సంతరించుకోగా.. చెరువులు, కుంటలు నిండి మత్తడులు పోశాయి. జల వనరులైతే పెరిగాయి గాని.. పంటలపొలాలను వర్షాలు నిండా ముంచాయి. ములుగు జిల్లాలో అధికశాతం మంది రైతులు వరి, పత్తి సాగు చేస్తున్నారు. ఆగస్టు మాసంలో కురిసిన అధిక వర్షాలు  పంటకు శాపంగా మారాయి. నీట మునిగిన పంటలతో.. రైతన్న ఆశలు అడుగంటాయి. చేతికి అందివస్తుందనుకున్న పంట నీటి పాలవ్వడంతో ఏం చేయాలో పాలుపోవడంలేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

Crop damage to farmers with heavy rains
నీటమునిగిన వరి, పత్తి పంటలు.. అన్నదాతల అగచాట్లు

By

Published : Aug 28, 2020, 12:42 PM IST

నీటమునిగిన వరి, పత్తి పంటలు.. అన్నదాతల అగచాట్లు

ఈ ఏడాది రుతుపవనాలు అనుకూలించడంతో జూన్ మాసంలోనే వర్షాలు కురిశాయి. సాగుకు అనుకూలంగా వర్షాలు కురవడంతో ములుగు జిల్లాలోని రైతులు అధిక విస్తీర్ణంలో వరి, పత్తి పంటలు సాగు చేశారు. సకాలంలో ఊడుపులు పూర్తి చేసుకున్నారు. తీరా కలుపు తీతలు మొదలై.. పంటకు ఎరువులు అందించే సమయానికి.. వానలు ఊపందుకోవడంతో పంటలు నీటి పాలయ్యాయి. వరదనీటి ఉద్ధృతికి రామప్ప సరస్సు లోతట్టు ప్రాంతంలో వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. ఈ పరిస్థితుల్లో మరో పంట సాగు చేసే అవకాశం లేకపోవడంతో.. తీవ్రంగా నష్టపోతున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధిక వర్షాలకు వరద నీరు ఉద్ధృతంగా రావడంతో పొలాలు మునిగి.. కనుచూపు మేర ఇసుక మేటను తలపిస్తున్నాయని రైతులు చెబుతున్నారు. సాగు భూములనే నమ్ముకుని జీవనం సాగిస్తున్న తమకు తుడిచిపెట్టుకుపోయిన పంటలతో ఆర్థిక ఆధారం లేకుండా పోయిందంటూ వాపోతున్నారు. ఎకరాకు పెట్టుబడిగా 20 నుంచి 25 వేల రూపాయలు ఖర్చు చేస్తే.. ఊహించని వర్షాలు ఆశలపై నీళ్లు చల్లాయని రైతులు దిగాలు పడుతున్నారు.

కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలో 7 వేల 2 వందల ఎకరాల వరి పంట, 6 వందల ఎకరాల్లో పత్తి పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. నీటమునిగిన పొలాలు తేలిన తర్వాతనే పరిగణలోకి తీసుకొని.. 33శాతం కంటే ఎక్కువ పంట నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందేలా చూస్తామన్నారు. పంట నష్టం అంచనా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని.. ఆదేశాలు వచ్చిన వెంటనే తదుపరి చర్యలు తీసుకుంటామని వారు తెలియజేశారు.

రామప్ప సరసు పరివాహక ప్రాంతంలో అధిక విస్తీర్ణంలో పంటపొలాలు ముంపునకు గురవుతున్న నేపథ్యంలో.. అధికారులు చొరవ తీసుకుని సమస్యను వెంటనే పరిష్కరించాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి:కర్ణాటకలో కరోనా కల్లోలం- ఒక్కరోజే 9 వేల కేసులు

ABOUT THE AUTHOR

...view details