మేడారంలో కృత్రిమ మేధస్సుతో నిఘా రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరగబోయే మేడారం జాతరలో పోలీసు శాఖ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించనుంది. కృత్రిమ మేధస్సు ద్వారా తప్పిపోయిన భక్తులను గుర్తించడం.. భక్తుల రద్దీ, వాహనాల రాకపోకలు నియంత్రించేందుకు కసరత్తు చేస్తోంది. ఈసారి జాతరకు సుమారు 70 లక్షల మందికి పైగా భక్తులు తరలి రావచ్చని పోలీసు శాఖ అంచనా వేస్తుంది. దాదాపు 12 వేల మంది పోలీసులు భద్రతా విధుల్లో ఉండనున్నారు. ఇప్పటి వరకూ జరిగిన బందోబస్తుకు భిన్నంగా ఈ సారి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం విరివిగా వినియోగించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి నిర్ణయించారు.
కుంభమేళా తరహాలో..
క్రితం సారి మహా కుంభమేళా తరహాలో మేడారం జాతరకు ఈ దఫా కృత్రిమ మేధస్సు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించనున్నారు. జాతర తీరు తెన్నులు పసిగట్టడం ద్వారా సీసీ కెమెరాలే కమాండ్ కంట్రోల్ కేంద్రంలోని భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేసేలా వీడియో అనలిటిక్స్ విధానం ఉపయోగపడనుంది. ప్రతి క్షణం ఏం జరుగుతుందనే విషయాన్ని గుర్తించడం ద్వారా ముందే అప్రమత్తమై తగిన జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు ఈ విధానం దోహదపడుతుంది. ఇందులో భాగంగా మేడారం జాతర పరిసరాల్లో 26 కిలోమీటర్ల మేర 350 పైగా సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించనున్నారు. జాతర ప్రాంగణంతోపాటు వాహనాల రాకపోకలు సాగే మార్గాలను ఈ కెమెరాలు చిత్రీకరించే ఏర్పాట్లు చేస్తున్నారు.
నేరస్థులపైనా నిఘా:
ఈ జాతరలో తప్పిపోయిన భక్తులను గుర్తించేందుకు ముఖ కవళికలు గుర్తింపు విధానం అందుబాటులో ఉంచబోతోంది పోలీసు శాఖ. తెలంగాణసహా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తుల్లో.. వేల సంఖ్యలో చిన్నారులు, వృద్ధులు తప్పిపోయే అవకాశాలు ఉండటం వల్ల.. ఈ నిర్ణయం తీసుకున్నారు. తప్పిపోయిన వారిని సీసీ కెమెరాల దృశ్యాలతో అనుసంధానం చేయడం ద్వారా వడపోసి కొంత సేపట్లోనే ఎక్కడ ఉన్నారో సులభంగా గుర్తిస్తారు. జాతరలో జేబు, చరవాణి, గొలుసు దొంగల ప్రమాదం పొంచి ఉన్నందున పాత నేరస్థులపై నిఘా ఏర్పాటు చేయనున్నారు. ఈ తరహా నేరస్థుల జాబితా రూపొందించి వారి చిత్రాలను సీసీ కెమెరాల వ్యవస్థకు అనుసంధానం చేయనున్నారు. తద్వారా నేరస్థులను కనిపెట్టేందుకు అవకాశం ఉండనుంది.
భవిష్యత్తులో వినియోగించే అవకాశం:
ఈ కృత్రిమ మేథస్సు విధానం విజయవంతమైతే... భవిష్యత్తులో అన్ని జాతరలతోపాటు హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం, హనుమాన్ శోభాయాత్ర వంటి కార్యక్రమాల్లో కూడా వినియోగించాలని పోలీసు శాఖ భావిస్తోంది. ఇప్పటికే కృత్రిమ మేథస్సుపై ఎంపిక చేసిన పోలీసులకు నాణ్యమైన శిక్షణ ఇస్తున్నారు.
ఇవీ చూడండి:తెలంగాణలో ప్రశాంతంగా జరిగితే.. ఏపీలో రచ్చ జరుగుతోంది..