Medaram Prasadam: మేడారం సమ్మక్క-సారలమ్మ ప్రసాదాన్ని ఆర్టీసీ పార్శిల్ సర్వీస్‌తో పాటు పోస్ట్ ద్వారా భక్తుల ఇళ్ల వద్దకు చేర్చనున్నట్లు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ, తపాలా, ఐటీ శాఖల సహకారంతో డోర్ డెలివరీ చేసేలా దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేస్తుందని చెప్పారు. అమ్మవారి ప్రసాదం నేరుగా పొందలేని వారికి... ఆర్టీసీ పార్శిల్ సర్వీస్ లేదా పోస్ట్ ద్వారా తమ ఇంటికే చేరవేసేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. భక్తుల ఆర్డర్ మేరకు ఇంటి నుంచే బెల్లం-బంగారం ప్రసాదం అమ్మవారికి సమర్పించే వారి కోసం కూడా ఆర్టీసీ సంస్థ భక్తుల ఇంటికి వచ్చి ప్రసాదాన్ని తీసుకుని వెళ్లనుందని వివరించారు.
బంగారాన్ని అమ్మవారికి సమర్పించిన అనంతరం తిరిగి భక్తులకు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఆన్లైన్లో మీసేవ లేదా టీయాప్ ఫోలియో మొబైల్ యాప్‌లో బుక్ చేసుకోవాలన్నారు. అనంతరం వారికి పోస్టల్ సేవల ద్వారా ప్రసాదాన్ని డోర్ డెలివరీ చేస్తారని తెలిపారు. ఆర్టీసీ పార్శిల్ సేవల ద్వారా ప్రసాదాన్ని పొందాలనుకునే వారు ఆ సంస్థను సంప్రదించాలన్నారు. ఈ సేవలకుగాను ఒక ప్రసాదం ప్యాకెట్‌కు భక్తులు రూ. 225 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఆర్టీసీ ద్వారా సేవలను పొందేవారికి ఈ ఛార్జీలు వర్తించవన్నారు.
దూరాన్ని బట్టి ఛార్జీలను ఆర్టీసీ సంస్థ నిర్ణయిస్తుందని.. 200 గ్రాముల బెల్లం ప్రసాదం, పసుపు-కుంకుమ, అమ్మవారి ఫొటోను భక్తులకు ఇంటి వద్ద అందజేస్తామన్నారు. ఈనెల 12-22 వరకు ఆన్లైన్లో ఇంటికే ప్రసాదం సేవలను వినియోగించుకోవాలని మంత్రి కోరారు. మొక్కులుగా బెల్లం చెల్లించాలనుకున్న వారు తెలంగాణ ఆర్టీసీ వెబ్‌సైట్‌లో సంప్రదించవచ్చని ఆర్టీసీ మరో ప్రకటనలో తెలిపింది. మరింత సమాచారం కోసం 040 30102829, 040 68153333 నంబర్లను సంప్రదించాలని సూచించింది.