తెలంగాణ

telangana

ETV Bharat / state

ములుగు జిల్లాలో కలకలం రేపుతున్న చిరుత సంచారం - తెలంగాణ వార్తలు

చిరుత సంచారం ములుగు జిల్లాలో కలకలం రేపుతోంది. వాజేడు మండలం కొంగాల అటవీ ప్రాంత పరిసర గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇటు అటవీ శాఖ అధికారులు చిరుత సంచారంపై ఆరా తీస్తున్నారు. ఎలాంటి భయం వద్దని చెబుతూ.. వాటికి హాని తలపెట్టొద్దని కోరుతున్నారు.

A leopard roaming in Mulugu district
ములుగు జిల్లాలో కలకలం రేపుతున్న చిరుత సంచారం

By

Published : Feb 25, 2021, 12:17 PM IST

ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో చిరుత పులుల సంచారం ఎప్పటి నుంచి ఉన్నా.. తాజాగా ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల అటవీ ప్రాంతంలో.. చిటారు కొమ్మనెక్కిన చిరుత.. గ్రామస్థుల కంట బడింది. దీంతో కేకలు వేయడం.. పెద్దగా శబ్దాలు చేయటంతో.. అది అడవిలోకి పరిగెత్తింది. చిరుత సంచారంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. మంగళవారం కొంగాల అటవీ పరిసర ప్రాంతాలను పరిశీలించారు.

కంటిమీద కునుకు లేకుండా

మాసంలొద్ది, దూసపాటిలొద్ది జలపాతం గుంతల్లో దాహం తీర్చుకోవడానికి వచ్చిన జంతువులను వేటాడేందుకు చిరుత వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. నాలుగు నెలల క్రితం కూడా పులుల సంచారం సమీప గ్రామ ప్రజలను హడలెత్తించింది. వరంగల్ గ్రామీణ జిల్లా, ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లా సరిహద్దు అడవుల్లో పులి సంచారించిన ఆనవాళ్లు ఆయా గ్రామాలవారికి కంటిమీద కునుకు లేకుండా చేశాయి. పాకాల అభయారణ్యం పరిసరాలు.. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం రాంపూర్ అటవీ ప్రాంతం, బండమీది మామిడి తండా శివారు, గుంజేడు, జంగవానిగూడెం గూడూరు మండలం అప్పరాజుపల్లె, ఊట్ల మట్టెవాడ తదితర గ్రామాల పరిధిలోని అటవీ ప్రాంతాల్లోని చిరుత సంచారం భయకంపితులను చేస్తోంది.

భయాందోళన అక్కర్లేదు

ములుగు మండలం పెగడపల్లి గ్రామ శివారు దుబ్బగూడంలో కూడా చిరుత పులి సంచరించింది. పత్తి చేనులో పనిచేసే కూలీలు పులిని చూసి భయంతో పరుగులు తీశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం యామన్​పల్లి అటవీ ప్రాంత పరిసరాల్లో ఓ అవును, అడవిపందిని చంపిన ఆనవాళ్లు కనపించాయి. గ్రామస్థులు ఒంటరిగా తిరగొద్దని.. పులిని చంపేందుకు.. ఉచ్చులు, కరెంటు తీగలు పెట్టవద్దంటూ అధికారులు అప్పట్లో దండోరా వేయించారు. ఆ తరువాత చిరుత క్రమంగా తిరుగుతూ... పెద్దపల్లి జిల్లా వైపు వెళ్లటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు మళ్లీ తాజాగా చిరుత సంచారం.. అటవీ ప్రాంత సమీప గ్రామస్థులను కలవరానికి గురి చేస్తోంది. అయితే వీటి సంచారంపై ప్రజలు భయాందోళనలు చెందనక్కరలేదని అధికారులు చెబుతున్నారు.

ఛత్తీస్​గఢ్​లోని అభయారణ్యాల నుంచి గోదావరి నది దాటి... ఇటు వైపు వస్తున్నాయని.. తెలంగాణలో అటవీ ప్రాంతం విస్తరించడం, నీరు ఆహారం సమృద్ధిగా దొరుకడం వల్ల పులి, చిరుతల రాక పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. అటవీ ప్రాంతాల్లో తిరిగేటప్పుడు గ్రామస్థులు జాగ్రత్తగా ఉండాలని.. అవి కంట పడితే.. వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు. వాటికి ఎలాంటి హాని తలపెట్టొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చదవండి:ఉస్మానియాలో దుస్థితి... నేలపైనే రోగుల అవస్థలు

ABOUT THE AUTHOR

...view details