పట్టుదల ఉంటే ఎంచుకున్న రంగాల్లో అద్భుతాలు సాధించవచ్చు. ఏకాగ్రత లేకుండా ఏళ్ల తరబడి సాగిపోయే శిక్షణ కంటే.. మనస్ఫూర్తిగా చేసే కొద్దికాలం సాధనైనా మంచి ఫలితాలిస్తుంది. సరిగ్గా ఇదే నిరూపిస్తోంది.. మేడ్చల్‌లోని కుత్భుల్లాపూర్ మండలం గిరినగర్‌కు చెందిన వనమాలి అఖిల.
ఆమె టార్గెట్.. అస్సలు మిస్సవ్వదు..! ఫైరింగ్‌పై మక్కువ
అఖిల.. బేగంపేటలోని తెలంగాణ రాష్ట్ర ఏవియేషన్ అకాడమీలో ఇంటిగ్రేటెడ్ కోర్సు అభ్యసిస్తోంది. ఈ సమయంలోనే నేషనల్ క్యాడెట్ కాప్స్-ఎన్సీసీకి ఆకర్షితురాలై శిక్షణలో చేరింది. ఇక్కడ నేర్పించే ఫైరింగ్‌పై మక్కువ పెంచుకుని తానూ షూటర్‌గా మారాలని నిర్ణయించుకుంది. కుటుంబమూ సహకరించడంతో మంచి ప్రతిభ కనబర్చుతోంది ఈ యువతి.
ధైర్యంగా నిలబడి
చిన్నప్పటి నుంచి షూటింగ్‌లో సాధన చేసే వారు చాలామంది ఉంటారు. వాళ్లకు భిన్నంగా 2018లో డిగ్రీ ద్వితీయ ఏడాదిలో శిక్షణలోకి ప్రవేశించింది అఖిల. అప్పటి నుంచి షూటింగ్‌పైనా పూర్తిగా దృష్టి పెట్టి సాధన చేస్తోంది. ఆర్థికపరంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా... ధైర్యంగా నిలబడి.... అనుకున్న రంగంలో దూసుకుపోతోంది.
అండగా కుటుంబం
షూటింగ్ చాలా ఖరీదైన క్రీడ. ఇక్కడ వినియోగించే... తుపాకీల నుంచి ప్రతీ వస్తువుకు వేలు, లక్షలు వెచ్చించాల్సిందే. కానీ... అఖిల మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. ఉన్నంతలో బాగానే జరిగిపోతున్నా.. లక్షలు ఖర్చు చేసే పరిస్థితి మాత్రం లేదు. అయినా... ఆమె అభిరుచిని కాదనలేని ఆ కుటుంబం... ఆమెకు అన్ని తీరులుగా అండగా నిలిచింది.
దాచుకుందంతా ఇచ్చేశాడు
తుపాకీ కొనేందుకు 2న్నర లక్షలు అవసరమయ్యాయి. అంత డబ్బు ఆ కుటుంబానికి తలకు మించిన భారమే. అయినా... కుమార్తె లక్ష్యానికి పేదరికం అడ్డు కావొద్దని పదేళ్లుగా కడుతున్న ఎల్ఐసీ పాలసీ ఉపసంహరించుకున్నాడు ఆమె తండ్రి. బిడ్డ ఆనందం కోసం.. పొదుపు మొత్తం వెచ్చించి తుపాకీ కొనుగోలు చేశారు.
షూటింగ్‌లో పట్టు
2019లో హైదరాబాద్‌లోని ప్రముఖ అకాడమీలో శిక్షణలో చేరింది అఖిల.. అక్కడ ఖర్చులు భరించలేక.. తెలంగాణ రాష్ట్ర క్రీడాపాధికారక సంస్థ ఆధ్వర్యంలోని షూటింగ్ రేంజ్‌లోకి మారి పోయింది. ఇక్కడ కోచ్ సందీప్ ప్రత్యేకచొరవతో తక్కువకాలంలోనే షూటింగ్‌లో పట్టు సాధించింది వనమాలి అఖిల.
రికార్డు
రాష్ట్ర స్థాయి, ప్రి నేషనల్, నేషనల్ స్థాయిలో అర్హత సాధించిన అఖిల.... ఫిబ్రవరిలో జరిగిన తెలంగాణ రాష్ట్రస్థాయి షూటింగ్ పోటీల్లో స్వర్ణం గెలుచుకుంది. 10 మీటర్ల వ్యక్తిగత విభాగంలో 400కు 394 పాయింట్లు సాధించి రికార్డు సృష్టించి.... ఈ ఘనత పొందిన మహిళా క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది.
ప్రశంసల జల్లు
సంవత్సరాల తరబడి శిక్షణ పొందే క్రీడాకారులు సైతం సాధించలేని విజయం అతితక్కువ కాలంలో సొంతం చేసుకుని అందరి ప్రశంసలు అందుకుంటోంది అఖిల. తన అభిరుచిన గుర్తించి అండగా నిలిచిన కుటుంబసభ్యుల నమ్మకాన్ని నిలబెట్టుకున్నందుకు గర్వంగా ఉందని చెబుతోంది.
అదే లక్ష్యం..
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు సాధిస్తానని ధీమాగా చెబుతున్న అఖిల ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలవడమే లక్ష్యమంటోంది. తాను ఆర్థికంగా స్థిరపడిన తర్వాత ఈ రంగంలోకి వచ్చే యువ క్రీడాకారులకు సాయం అందిస్తానని చెబుతోంది.