అవినీతి నిరోధకశాఖ చరిత్రలోనే ఇది తొలిసారి. ఓ ప్రభుత్వాధికారి ఏకంగా కోటి రూపాయలకుపైగా లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. బాధితులెవరూ ఫిర్యాదు చేయకుండానే నేరుగా అనిశా అధికారులే నిఘా పెట్టి... కీసర తహసీల్దార్ నాగరాజును అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. ఇతడ్ని నోట్ల కట్టల్లో ముంచేసి భూముల్ని కొట్టేద్దామనుకున్న ఓ ప్రముఖ రాజకీయ నేత అనుచరుడు, స్థిరాస్థి దళారి, వీఆర్ఏను ఈ వ్యవహారంలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లిదాయరలో 53ఎకరాల భూమిపై గత కొంతకాలంగా కోర్టులో వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే రైతుల తరఫున కీసర తహసీల్దార్ నాగరాజును స్థిరాస్తి వ్యాపారులు శ్రీనాథ్, అంజిరెడ్డి సంప్రదించారు. భూ వ్యవహారాన్ని తమకనుకూలంగా సెటిల్ చేయమని వారు కోరారు. సమస్య పరిష్కారానికి తహసీల్దార్ 2 కోట్ల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. అందుకు స్థిరాస్తి దళారులు ఒప్పుకుని ఎఎస్ రావు నగర్‌లోని అంజిరెడ్డి బంధువుల ఇంటికి నాగరాజును పిలిపించుకున్నారు. తహసీల్దార్ నాగరాజు పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటున్నాడనే సమాచారంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు నిఘా పెట్టారు. నాగరాజు అడ్వాన్స్‌గా కోటి 10లక్షల రూపాయలకుపైగా లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.