TRS Flexy electric shock: అధికార పార్టీ నాయకురాలి నిర్వాకంతో ఇద్దరు బాలురు అవిటివారిగా మారిపోయారు. ఈ విషాద ఘటన బాలల దినోత్సవం రోజున జరిగింది. నిజాంపేట్ పరిధిలోని తెరాస నాయకుడు ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీని తీసే క్రమంలో ఇద్దరు బాలురు విద్యుదాఘాతానికి గురి కాగా.. ఒకరు రెండు చేతులు కోల్పోగా.. మరొకరు పాదాలు కోల్పోయారు. ప్రస్తుతం వీరిద్దరు నిజాంపేట్ రోడ్డులోని హోలిస్టిక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పట్టించుకోని తెరాస నాయకురాలు స్వర్ణకుమారి
TRS leader: ఈ ఘటనకు కారణమైన తెరాస నాయకురాలు స్వర్ణకుమారి వారి ఆరోగ్య పరిస్థితిని కనీసం పట్టించుకోవడం లేదని చిన్నారుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఆస్పత్రి బిల్లులు పెరిగిపోవడంతో చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
ఫ్లెక్సీ కోసం బాలురను పురమాయించి..
తెరాస నాయకుడు ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ముగిసిన రెండు రోజుల తర్వాత ఫ్లెక్సీని తీసేందుకు డివిజన్ తెరాస మహిళా సంఘం ప్రెసిడెంట్ స్వర్ణ కుమారి తన ఇంటి రేకుల మీద పెట్టేందుకు ప్రయత్నించింది. ఆమె వల్ల కాకపోవడంతో పక్కనే ఆడుకుంటున్న నవీన్, శ్రీకాంత్‌లను పిలిచి రేకుల మీద పెట్టమని పురమాయించింది. మేము రాలేము అని చెప్పినా వినకుండా స్వర్ణకుమారి వారిని బలవంతంగా రేకుల మీదకు ఎక్కించింది. ఫ్లెక్సీ పెట్టె తరుణంలో పక్కనే ఉన్న విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్ కారణంగా ఇద్దరు బాలురు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఒకరికి రెండు చేతులు పోగా.. మరొకరికి పాదాలు పోయాయి.