Corporators boycott: మేయర్, అధికారులు నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ అధికార పార్టీ కార్పొరేటర్లు ఆందోళన చేశారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశాన్ని తెరాస కార్పొరేటర్లు బహిష్కరించారు. మేయర్ సామల బుచ్చిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో.. డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి, తెరాస కార్పొరేటర్లు చీరాల నరసింహా, సింగిరెడ్డి పద్మారెడ్డి, మిగతా కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని.. కార్పొరేటర్ల నిర్ణయాలను పరిగణలోకి తీసుకోవడంలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు.
అందుకే సమావేశ బహిష్కరణ..
ఇప్పటికే రెండు కోట్ల 30 లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన ఆటోలు నిరుపయోగంగా పడి ఉన్నాయని కార్పొరేటర్లు ఆరోపించారు. ఇప్పుడు మరో 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ట్రాక్టర్ల కొనుగోలు తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. అందుకోసమే కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించినట్టు తెలిపారు. తాము ఎన్నుకుంటేనే మేయర్ అయ్యారని.. అది గుర్తు పెట్టుకొని వ్యవహరించాలని కార్పొరేటర్లు సూచించారు. బోడుప్పల్లో జరుగుతున్న నిధుల దుర్వినియోగం, మేయర్, అధికారుల తీరును అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇప్పటికైనా.. మేయర్, అధికారులు తమ వ్యవహారశైలిని మార్చుకొని తమ డివిజన్ల అభివృద్ధికి సహకరించాలని డిమాండ్ చేశారు. వీరికి భాజపా, కాంగ్రెస్ కార్పొరేటర్లు మద్దతు పలికారు.
ఇదీ చూడండి: