రాష్ట్రంలో గడిచిన ఏడేళ్లలో దళితులకు, గిరిజనులకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్.. ఆయా వర్గాల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు దళిత గిరిజనుల పక్షాన పోరు బాట పట్టింది. ఇప్పటికే దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న కాంగ్రెస్ ఇవాళ, రేపు రెండు రోజుల దీక్ష చేయడం ద్వారా పోరు ఉద్ధృతం చేయనుంది. ఇందుకోసం ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న మూడు చింతలపల్లిలోనే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వేదికగా ఎంచుకున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో లబ్దిపొందేందుకు దళిత బంధును తెచ్చిందని ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ... ఆ పథకానికి వ్యతిరేఖం కాదని స్పష్టం చేయడంతోపాటు రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది.
క్విట్ ఇండియా దినోత్సవం రోజున ఈ నెల 9న దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలకు పోరాటాలకు నిలయమైన ఇంద్రవెల్లి నుంచి శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ పార్టీ.. రావిర్యాలలో సభలను నిర్వహించింది. ఈ రెండు సభలకు అంచనాలకు మించి ప్రజాస్పందన రావడంతో... మూడో సభను గజ్వేల్‌లో ఏర్పాటు చేయాలని భావించింది. సమయం తక్కువ ఉండడంతో... ఏర్పాట్లకు ఇబ్బందులు ఏర్పడతాయని భావించిన పార్టీ రాజకీయ వ్యవహారాల ముఖ్య నాయకుల సమావేశం 48 గంటల దీక్షకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. దీక్ష కోసం మూడు చింతలపల్లి ఊరు బయట భారీ శిబిరం ఏర్పాటు చేశారు. వర్షం వచ్చినా ఇబ్బందులు తలెత్తకుండా అయిదారువేల మంది ఉండేందుకు వీలుగా...వాటర్ ప్రూఫ్ షెడ్ వేశారు. ఎప్పుడూ 15వేల నుంచి 20వేల మంది శిబిరం వద్ద ఉంటారని అంచనా వేసి అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేశారు.
సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న మూడు చింతలపల్లిలో రెండు రోజుల దీక్ష ఇవాళ ఉదయం 10 గంటలకు మొదలవుతుంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోపాటు దళిత, గిరిజన ముఖ్య నాయకులు, వేలాది మంది కార్యకర్తలు దీక్షలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు రేవంత్ రెడ్డి దీక్షను ఉద్దేశించి మాట్లాడతారు. ఇవాళ రాత్రికి దళితవాడలో రేవంత్ రెడ్డి బస చేస్తారు. రేపు ఉదయం నిద్ర లేచిన తరువాత... రచ్చబండ మాదిరి అక్కడే దళిత వాడలో స్థానికులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారని ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ చెప్పారు.