KTR Medchal Tour : మేడ్చల్ జిల్లాలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పేట్‌బషీరాబాద్‌లో పర్యటించిన మంత్రి.. ఫాక్స్‌సాగర్ వద్ద అభివృద్ధి పనులు ప్రారంభించారు. కోల్ కాలువ, కెమికల్ కాలువ, తూము కాలువ అభివృద్ధి పనులను ప్రారభించారు. 95 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. శివారు ప్రాంతాల్లో 2 వేల కోట్లతో మంచినీటి పనులు చేపట్టామని మంత్రి కేటీఆర్ వివరించారు. ఓఆర్ఆర్ పరిధిలోని కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు మంచినీరు అందిస్తున్నామని తెలిపారు.
ఇళ్ల క్రమబద్ధీకరణ కోసం జీవోలు..
Minister KTR in Medchal : నాగార్జునసాగర్ నుంచి నగరానికి నీటి తరలింపు కోసం మరో పైపులైన్ చేపడుతున్నామని.. ఇప్పటికే 600 మిలియన్ గ్యాలన్లు నీటిని అందిస్తున్నామని మంత్రి చెప్పారు. నగరంలో నీటిశుద్ధీకరణ కోసం 3 వేల కోట్లతో సీవరేజ్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 27 కోట్ల 31 లక్షలతో ఫాక్స్‌సాగర్, వెన్నెలగడ్డ చెరువు, మురుగునీటి శుద్ధీకరణ కేంద్రాలు.. గాజులరామరంలో 11 కోట్లతో ఆక్సిజన్ పార్కు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికలు లేకపోయినా నిరంతరం అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కేటీఆర్ వివరించారు. ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న ఇళ్ల క్రమబద్ధీకరణ కోసం జీవో 58, 59ని మళ్లీ తీసుకొస్తామని ప్రకటించారు.
ఎంపీలు పోరాడాలి..
KTR on GO 58, 59 : హైదరాబాద్ అభివృద్ధి కోసం కేంద్రాన్ని 7 వేల8 వందల కోట్లు అడిగామని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం బడ్జెట్ సమావేశంలో తెరాస ఎంపీలు పోరాడాలని సూచించారు. రక్షణశాఖ స్థలం ఇవ్వాలని ఏడున్నరేళ్లుగా కేంద్రాన్ని అడుగుతున్నా పట్టించుకోవడం లేదని కేటీఆర్ మండిపడ్డారు.