తెలంగాణ

telangana

ETV Bharat / state

కుత్బుల్లాపూర్‌లో 238 ప్రైవేటు బడులు.. రాష్ట్రంలోనే తొలిస్థానం - తెలంగాణ తాజా వార్తలు

రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో విద్యాహక్కు చట్టం అమలుకావడం లేదు. ప్రభుత్వ పాఠశాలల సమీపంలో ప్రైవేటు బడులు ఏర్పాటుచేయకూడదన్న నిబంధనను గాలికొదిలేశారు. ఫలితంగా కొన్నిచోట్ల ప్రైవేటు పాఠశాలలు అధిక సంఖ్యలో ఏర్పాటవుతున్నాయి. మేడ్చల్‌ జిల్లా పరిధిలోని కుత్బుల్లాపూర్‌ మండలం 238 పాఠశాలలతో రాష్ట్రంలో తొలి స్థానంలో నిలిచింది.

private schools in telangana
కుత్బుల్లాపూర్‌లో 238 ప్రైవేటు బడులు.. రాష్ట్రంలోనే తొలిస్థానం

By

Published : Feb 21, 2021, 7:34 AM IST

రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు ప్రైవేటు పాఠశాలలతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రభుత్వ బడుల కంటే రెండు నుంచి అయిదు రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఒక్కో మండలంలో 160 నుంచి 240 వరకు ప్రైవేటు బడులు నడుస్తున్నాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రభుత్వ పాఠశాలల సమీపంలో ప్రైవేటు బడులు ఏర్పాటు చేయకూడదు. ఈ నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. మరోవైపు ఒక్క ప్రైవేటు పాఠశాల కూడా లేని మండలాలు 12 ఉన్నాయి. పాఠశాల విద్యాశాఖ ఏటా జిల్లా విద్యా సమాచారం (డైస్‌) పేరిట తాజాగా సేకరించిన గణాంకాలు ఈ అంశాలను స్పష్టం చేస్తున్నాయి.

10 మండలాల్లోనే 20 శాతం

రాష్ట్రవ్యాప్తంగా 590 మండలాల్లో అన్ని రకాల బోర్డులకు సంబంధించిన మొత్తం 10,732 ప్రైవేటు పాఠశాలలు నడుస్తున్నాయి. వీటిలో హైదరాబాద్‌ జిల్లాలో 1,901, మేడ్చల్‌లో 1,380, రంగారెడ్డిలో 1,350 కలిపి మొత్తం 4,631 పాఠశాలలున్నాయి. ఈ మూడు జిల్లాల్లోనే 43 శాతం ఉండటం గమనార్హం. రాష్ట్రంలోని 10 మండలాల్లోనే 2,102 ప్రైవేటు పాఠశాలలున్నాయి. మొత్తం సంఖ్యలో ఇది సుమారు 20 శాతం. ఆ 10 మండలాలూ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉండటం విశేషం. మేడ్చల్‌ జిల్లా పరిధిలోని కుత్బుల్లాపూర్‌ మండలం 238 పాఠశాలలతో రాష్ట్రంలో తొలి స్థానంలో నిలిచింది.

సర్కారు పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ఎన్‌ఓసీ లేకుండానే...

విద్యాహక్కు చట్టం నిబంధనలను పట్టించుకోకుండానే విద్యాశాఖ అధికారులు ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు ఇస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు కిలోమీటరు పరిధిలో ప్రైవేటు ప్రాథమిక పాఠశాల (1-5 తరగతులు), ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు 3 కిలోమీటర్ల పరిధిలో ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల (1-8 తరగతులు), ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు 5 కిలోమీటర్ల పరిధిలో ప్రైవేట్‌ ఉన్నత పాఠశాల ఏర్పాటు చేయకూడదు. వాటిని నెలకొల్పాలంటే అక్కడున్న ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నుంచి నిరభ్యంతర ధ్రువపత్రం (ఎన్‌ఓసీ) తప్పనిసరి. అవేమీ లేకుండానే అధికారులు అనుమతులు ఇస్తున్నారని టీఆర్‌టీఎఫ్‌ గౌరవ సలహాదారు ప్రతాప్‌రెడ్డి తెలిపారు. కర్ణాటకలో ఎక్కువ ప్రైవేటు పాఠశాలలున్న ప్రాంతాల్లో అయిదేళ్లపాటు కొత్త వాటికి అనుమతులు ఇవ్వకూడదని నిర్ణయించారు. అదే విధానాన్ని ఇక్కడా అమలు చేయాల్సిన అవసరం ఉందని విద్యాశాఖ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.

ఒక్క ప్రైవేటు పాఠశాల కూడా లేని మండలాలు

భీమ్‌పూర్‌, సిరికొండ(ఆదిలాబాద్‌ జిల్లా), కరకగూడెం (భద్రాద్రి కొత్తగూడెం), పలిమెల(భూపాలపల్లి), పెద్దకోడప్‌గల్‌(కామారెడ్డి), లింగాపూర్‌, సిర్పూర్‌(యు)(కుమురం భీం), రేగోడ్‌(మెదక్‌), కన్నాయిగూడెం(ములుగు),, వేములవాడ గ్రామీణ, వీర్నపల్లి(సిరిసిల్ల), రాయపోల్‌(సిద్దిపేట జిల్లా).

ఇవీచూడండి:ఇంటి నుంచి పని... ఇంకెన్నాళ్లని..!

ABOUT THE AUTHOR

...view details