తెలంగాణ

telangana

ETV Bharat / state

REVANTH REDDY: ప్రగతి భవన్​ను.. ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే కర్మాగారంగా మారుస్తాం..! - telangana top news

మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో రేవంత్ రెడ్డి చేపట్టిన 48 గంటల దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్షను బుధవారంతో ముగిసింది. ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... మంత్రి మల్లారెడ్డి అవినీతిపై విచారణ చేయించాలని అన్నారు. అలాగే కాంగ్రెస్ అధికారంలో వచ్చాక ప్రగతి భవన్​ను బహుజన భవన్‌గా మారుస్తామని తెలిపారు.

revanth-reddy-comments-on-minister-mallareddy
ప్రగతి భవన్​ను.. ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే కర్మాగారంగా మారుస్తాం..!

By

Published : Aug 26, 2021, 6:34 AM IST

Updated : Aug 26, 2021, 8:54 AM IST

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ప్రగతిభవన్‌ను డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ బహుజన భవన్‌గా మారుస్తామని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దానిని దళిత, గిరిజన, ఆదివాసీల పిల్లలను డాక్టర్లు, ఇంజినీర్లు, ఐఏఎస్‌, ఐపీఎస్‌లుగా ఉత్పత్తి చేసే కర్మాగారంగా చేస్తామని చెప్పారు. దేశంలో ఐఏఎస్‌, ఐపీఎస్‌లు ఎక్కువగా తెలంగాణ నుంచే వచ్చేలా చూస్తామన్నారు. మేడ్చల్‌ జిల్లా మూడు చింతలపల్లిలో రేవంత్‌రెడ్డి చేపట్టిన 48 గంటల దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష బుధవారం సాయంత్రంతో ముగిసింది. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ దామోదర రాజనర్సింహా హాజరై రేవంత్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.

ప్రగతి భవన్​ను.. ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే కర్మాగారంగా మారుస్తాం..!

అనంతరం రేవంత్‌ మాట్లాడుతూ.. ‘‘నాకు ఎలాంటి కోరికలేవు.. దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. కాంగ్రెస్‌లో ఎవరైనా ముఖ్యమంత్రి కావొచ్చు. పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి అయిన వ్యక్తితో దళిత, గిరిజన, ఆదివాసీల విద్యకు ప్రత్యేక బడ్జెట్‌ కోసం మొదటి సంతకం పెట్టిస్తా’’ అని చెప్పారు. దళితబంధు అందరికీ ఇవ్వాలన్నదే తమ డిమాండ్‌ అని, బడ్జెట్‌ సరిపోకపోతే సెక్రటేరియట్‌, అసెంబ్లీ అమ్ముదామని, ఎక్కడ సంతకం పెట్టాలో చెబితే పెడతామన్నారు.

మూడుచింతలపల్లిలో దీక్షా కార్యక్రమంలో ప్రసంగిస్తున్న రేవంత్ రెడ్డి, వేదికపై దామోదర రాజనర్సింహ తదితరులు

ఏ శిక్షకైనా సిద్ధం

తన ప్రసంగంలో మంత్రి మల్లారెడ్డిపై రేవంత్‌ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. మేడ్చల్‌ ప్రాంతంలో ఎవరు భూములు అమ్మినా.. కొన్నా మంత్రికి కమీషన్లు ఇవ్వాల్సిందేనని ధ్వజమెత్తారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి సవాల్‌ విసురుతున్నా.. కబ్జాలతో ఆక్రమించిన.. అక్రమంగా నిర్మించిన మల్లారెడ్డి మెడికల్‌, ఇంజినీరింగ్‌ కళాశాలలు, జవహార్‌నగర్‌లో దవాఖానా, యూనివర్సిటీ భూములపై విచారణ చేయించాలి’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. ఒకవేళ తాను చేసిన ఆరోపణలు నిరూపించలేకపోతే సీఎం వేసే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు. మల్లారెడ్డి అవినీతిపై ఊరూరా తిరిగి ప్రచారం చేస్తామన్నారు.

తెలంగాణ కోసం కేసీఆర్‌ ఉద్యమం చేసి ఉండొచ్చు. ఆయనకు కష్టానికంటే ఎక్కువ కూలీ దక్కింది. రాష్ట్రం ఏర్పాటయ్యాక కొందరే బాగుపడ్డారు. టైమొస్తే బీసీ, మైనార్టీ, బ్రాహ్మణులకు ‘బంధు’ ఇస్తానని సీఎం చెబుతున్నారు. కానీ కేసీఆర్‌ టైం అయిపోయింది. ఇక ఆయన ఇంటికే. ఇప్పుడు తెలంగాణ సమాజానికి టైం వచ్చింది. - రేవంత్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

పాసు పుస్తకాలు కొత్తవి ఇవ్వడంలేదు

తమకు సంబంధించిన భూ సర్వే నంబర్లు 22, 30 అసైన్డ్‌ భూముల పాత పట్టాదారు పాసు పుస్తకాలను తీసుకొని ప్రభుత్వం కొత్తవి ఇవ్వలేదని మూడుచింతలపల్లి దళితవాసులు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి వివరించారు. అలాగే రెండు పడక గదుల ఇళ్లు, మూడెకరాల భూమి మంజూరు చేయలేదని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుడు, దళితుడైన బూరుగు ఆంజనేయులు ఇంట్లో మంగళవారం రాత్రి నిద్రించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బుధవారం ఉదయం 6.15 గంటలకు నిద్రలేచారు. 7.45 వరకు దళిత బస్తీలో పార్టీ నాయకులతో కలిసి పాదయాత్ర నిర్వహించి పలువురి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

మూడు చింతలపల్లి దళిత బస్తీవాసులతో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి

సభలో ఇచ్చిన హామీలు కూడా నేరవేర్చలేరు..

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లేందుకు నిర్మించిన రోడ్డు ఎత్తు పెంచడంతో తమ ఇళ్లలోకి వరదొచ్చి ఇబ్బందులు పడుతున్నామని బస్తీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఊరిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూములకు పాసుపుస్తకాలు ఇవ్వకుండా ఆ భూములను కుట్రతో ప్రభుత్వమే లాక్కుందని తెలిపారు. నాలుగేళ్ళ కిందట ఇదే గ్రామంలో సభ పెట్టి ముఖ్యమంత్రి ప్రకటన చేసిన పనులు కూడా జరగలేదని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. దత్తత గ్రామాల్లో అభివృద్ధి జరిగినట్లు నిరూపిస్తే తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు.

సదువుకుంటే శాసనం చేస్తం. సదువుకుంటే బాగుపడ్తం. సదువుకుంటే రాజ్యాధికారంలో భాగస్వాములమవుతాం. కాబట్టి నా దళిత, గిరిజన, ఆదివాసీ బిడ్డలు సదువుకోవాలే. మీ సెమట పోవాలే. మీ వాసన పోవాలే. మీ కుటుంబాలు, మీ ఇండ్లు మిమ్మల్ని చూస్తే దూరంగ పోయేటోళ్లు... ఒక్కసారి దళితులు మమ్మల్ని పలకరిస్తే బాగుండు, వాళ్ల ఇంటికి పిలిస్తే బాగుండు, వాళ్ల ఇంట్లో కూర్చొని బుక్కెడు బువ్వ తింటే మా జన్మ ధన్యమైందని అనుకునేటట్టు అభివృద్ధి పథం వైపు నడిపిచ్చేదందుకే పాటుపడ్తది ఈ కాంగ్రెస్. - రేవంత్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

రేవంత్‌ దీక్షను కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ రాష్ట్ర ఛైర్మన్‌ ప్రీతమ్‌, ఎస్టీ సెల్‌ ఛైర్మన్‌ జగన్‌లాల్‌ నాయక్‌ సమన్వయం చేయగా.. ఎమ్మెల్యే సీతక్క, సీనియర్‌ నాయకులు అజారుద్దీన్‌, మల్లు రవి, అద్దంకి దయాకర్‌, కుసుమకుమార్‌, మహేశ్వర్‌రెడ్డి, బలరాంనాయక్‌, అనిల్‌కుమార్‌ యాదవ్‌, బెలయ్యనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:1న కేఆర్‌ఎంబీ భేటీకి తెలంగాణ హాజరు... అధికారులకు సీఎం దిశానిర్దేశం

Last Updated : Aug 26, 2021, 8:54 AM IST

ABOUT THE AUTHOR

...view details