Rajnath Singh Election Campaign in Medchal: తెలంగాణలో ఎన్నికల దృష్ట్యా దేశంలో ముఖ్య నాయకులందరూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. జాతీయ పార్టీల క్యాంపెయినర్లు రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాల్లో జరుగుతున్న సమావేశాల్లో పాల్గొని.. ఆయా పార్టీల తరుఫున ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ(BJP)కి సంబంధించిన అగ్ర నాయకులు ఇప్పటికే పలువురు నాయకులు రాష్ట్రంలో పర్యటించారు.
ఈ క్రమంలోనే కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎన్నికల ప్రచారానికి హాజరయ్యారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లిలో బీజేపీ నాయకులు నిర్వహించిన సకల జనుల సంకల్ప సభ(BJP Public Meeting)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా హామీలు ఇచ్చి.. వాటిని నెరవేర్చలేదని విమర్శించారు.
Rajnath Singh Comments on BRS :తెలంగాణలో కచ్చితంగా బీజేపీ ప్రభుత్వాన్ని నెలకొల్పుతామని రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) ధీమా వ్యక్తం చేశారు. 27 సంవత్సరాలుగా గుజరాత్‌ను దేశంలోనే ఒక మోడల్‌గా అభివృద్ధి చేశామని.. తెలంగాణ ఎందుకు అభివృద్ధి చెందలేదని కేసీఆర్‌ను ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్(KCR) కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పని చేస్తుందని భరోసా ఇచ్చారు. అటల్ బిహారీ వాజపేయి నుంచి, మోదీ వరకు నాయకులపై ఏ ఒక్క అవినీతి మచ్చ లేదని తెలిపారు.
Rajnath Singh Election Campain in Telangana :కుటుంబానికి ఒక్క ఉద్యోగం ఇస్తానని చెప్పిన కేసీఆర్.. మోసం చేసి పేపర్ లీకేజ్‌లు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని.. ఏ ఒక్క దళితుడికీ ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని.. బీజేపీఅధికారంలోకి రాగానే అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపిస్తామని రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు.