ఆదివారం జరగనున్న వినాయక నిమజ్జన కార్యక్రమానికి రాచకొండ కమిషనరేట్ పరిధిలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు. విగ్రహాల నిమజ్జనం జరిగే చెరువుల వద్ద సీసీ కెమెరాలు, క్రేన్స్, విద్యుత్ దీపాలు, పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు సీపీ తెలిపారు.
గతంలో 2019లో రాచకొండ కమిషనరేట్ పరిధిలో 9472 విగ్రహాలకు దరఖాస్తులు రాగా ఈ సంవత్సరం 6329 వచ్చినట్లు సీపీ వెల్లడించారు. ఎల్బీనగర్, మల్కాజిగిరి, భువనగిరి జోన్లలో సమావేశాలు నిర్వహించి పోలీసులకు సూచనలిస్తున్నట్లు పేర్కొన్నారు. మూడు జోన్ల పరిధిలో వినాయక నిమజ్జనం జరిగే ప్రతి చెరువుల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు అన్ని రకాలుగా తమవంతు సహకారం అందించనున్నట్లు సీపీ మహేశ్ భగవత్ అన్నారు.
ఎల్బీనగర్ జోన్ పరిధిలోని సరూర్ నగర్, నాగోల్, మన్సూరాబాద్, తుర్కయాంజల్, ఇంజాపూర్, ఇనాంగూడా, జల్పల్లి చెరువుల వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. మల్కాజిగిరి జోన్లో ఉప్పల్ నల్లచెరువు, రాంపల్లి, కాప్రా, చెర్లపల్లి చెరువులు, భువనగిరి జోన్లో భునవగిరి, చౌటుప్పల్, బీబీనగర్ వద్ద పెద్ద పెద్ద చెరువుల వద్ద పూర్తిస్థాయిలో భద్రతా కల్పించనున్నట్లు వెల్లడించారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతగా జరిగేలా చర్యలు చేపడుతామని రాచకొండ సీపీ మహశ్ భగవత్ పేర్కొన్నారు.