ఏళ్ల తరబడి భూదస్త్రాల నిర్వహణలో చోటుచేసుకున్న నిర్లక్ష్యం ఇప్పుడు కొందరు రైతులకు శాపమవుతోంది. ధరణి సేవలు ప్రారంభమయ్యాక ఆర్‌ఎస్‌ఆర్ సమస్య మరింత జఠిలమవుతుందని రెవెన్యూ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
రాష్ట్రంలో భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమం (ఎల్‌ఆర్‌యూపీ) అనంతరం నవీకరించిన దస్త్రాల సమాచారాన్ని టీఎస్ ఐఎల్‌ఆర్‌ఎంఎస్‌లో (ధరణి) నిక్షిప్తం చేశారు. 1936లో నిర్వహించిన సర్వే వివరాలను పోర్టల్‌లో నిక్షిప్తం చేశారు. అనంతరం దానిలోకి ఎల్‌ఆర్‌యూపీ వివరాలను అప్‌లోడ్ చేశారు. ఇక్కడే ఆర్‌ఎస్‌ఆర్ సమస్య ఏర్పడింది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేసుకునే రైతులు ముందు స్టాంపు డ్యూటీ, చలానా చెల్లించి వాటి ఆధారంగా సంయుక్త సబ్ రిజిస్ట్రార్ (జేఎస్‌ఆర్)- తహసీల్దారుకు ఆన్‌లైన్‌లో స్లాట్ నమోదు చేస్తారు.
అధికారి సమయం ఇచ్చాక కొనుగోలుదారుడు కార్యాలయానికి హాజరవుతారు. అనంతరం అధికారి ధరణి పోర్టల్ తెరిచి వివరాలు నమోదు చేస్తారు. అప్పుడు ఆర్‌ఎస్‌ఆర్ అనుమతించకపోతే పోర్టల్‌లో ముందుకు వెళ్లే అవకాశం ఉండదు. ఇలాంటి సమస్య ఎదురైతే రిజిస్ట్రేషన్‌కు డబ్బులు చెల్లించిన రైతులకు ఏం జవాబు చెప్పాలని కొందరు తహసీల్దార్లు మల్లగుల్లాలు పడుతున్నారు. తాజాగా ధరణి పోర్టల్‌పై శిక్షణ సమయంలోనూ ఇలాంటి సమస్యలు ఎదురైనట్లు రెవెన్యూ సంఘం నాయకులు పేర్కొంటున్నారు. ఇలాంటి వాటికి వెంటనే పరిష్కారం చూపే విధానం అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. ఇది ఒక్క రైతుతో ఆగిపోదని ఆ సర్వే నంబరులోని అందరికీ వర్తిస్తుందని పేర్కొంటున్నారు. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) స్థాయిలోనే దీనిపై దృష్టి సారించాలని కోరుతున్నారు.