తెలంగాణ

telangana

ETV Bharat / state

చర్లపల్లి జైలులో ఖైదీల వ్యవసాయం.. 180 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి - తెలంగాణ వార్తలు

కారాగారాలు ఖైదీల సంస్కరణల నిలయాలుగా మారాయి. కరడుగట్టిన నేరస్థుల్లో సైతం పరివర్తనకు కృషి చేస్తున్నాయి. హైదరాబాద్‌ చర్లపల్లి కేంద్ర కారాగార అధికారులు ఖైదీలను సాగు బాట పట్టించి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఖైదీలు తొలిసారిగా వరి సాగు చేశారు. పంట చేతికొచ్చింది.

crop in charlapalli jail, charlapalli jail
వరిసాగు చేసిన ఖైదీలు, చర్లపల్లి జైలు

By

Published : Jun 9, 2021, 11:21 AM IST

హైదరాబాద్​లోని చర్లపల్లి కేంద్ర కారాగార వ్యవసాయ క్షేత్రంలో వరి సాగుకు కావాల్సిన వనరులు ఉన్నాయి. కూరగాయలతో పాటు మొక్కజొన్న, కందులు, పెసలు, ఉలవల సాగుతో పాటు, వ్యవసాయ అనుబంధ కోళ్లు, చేపల పెంపకంలో 89 మంది రాణిస్తున్నారు. ప్రస్తుతం తొలిసారిగా వరి సాగు చేశారు. పంట చేతికొచ్చింది. ఈ సారి ఖైదీలతో పండించాలని నిర్ణయించుకున్నట్లు పర్యవేక్షణాధికారి దశరథరామిరెడ్డి తెలిపారు. భూమితో పాటు గతేడాది అక్టోబరు, నవంబరు మాసాల్లో వర్షాలు సమృద్ధిగా కురిశాయి. నీటి కుంటలు నిండాయి. నీరు వృథా కాకుండా వరి సాగు ఆరంభించారు. అంతేకాకుండా వ్యవసాయ క్షేత్రంలోని ఆవులు, గేదెలకు పశుగ్రాసం కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇక్కడి పాలకు చాలా గిరాకీతో పాటు అధిక సంఖ్యలో వినియోగదారులున్నారు. పశుగ్రాసం కొరత కారణంగా పాల ఉత్పత్తికి విఘాతం కలుగుతోంది. పశుగ్రాస కొరతను అధిగమించొచ్చని ఆలోచన కూడా వరి సాగుకు కారణమని అధికారులు చెబుతున్నారు. జనవరి రెండో వారంలో నాట్లు వేశారు. మే మూడో వారానికి కోతలు చేపట్టారు.

మార్కెట్‌లో విక్రయం

పండించిన ధాన్యాన్ని మార్కెటింగ్‌ విభాగం అధికారులకు అప్పగించి, బహిరంగ విపణిలో అమ్మకానికి ఉంచనున్నట్లు చెప్పారు. వానాకాలం సీజన్‌లోనూ వరితో పాటు జొన్న సాగు చేస్తామని అధికారులు తెలిపారు. గింజలను వ్యవసాయ క్షేత్రంలోని పక్షులకు ఆహారం, చొప్పను పశుగ్రాసంగా ఉపయోగించనున్నట్లు పేర్కొన్నారు.

6 ఎకరాలు.. 180 క్వింటాళ్ల ధాన్యం

చర్లపల్లి కేంద్ర కారాగార వ్యవసాయక్షేత్రంలోని ఆరు ఎకరాల్లో రాజేంద్రనగర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రైస్‌ రీసెర్చీ వారి సన్నాలు, దొడ్డు రకం వరి విత్తనాలు సాగు చేశారు. రసాయన ఎరువులు కాకుండా కేవలం పశువుల పేడ మాత్రమే వినియోగించారు. మొత్తం ముగ్గురు ఖైదీలకు బాధ్యతలు అప్పగించారు. 180 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చినట్లు పంట ఇన్‌ఛార్జి వెంకట్‌రెడ్డి తెలిపారు. సాధారణ రైతులతో పోలిస్తే ఎక్కువ దిగుబడి వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు.

కాలానుగుణంగా మార్పులు

ఖైదీల్లోనూ మార్పు తీసుకొచ్చేలా చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వ సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. చర్లపల్లి కారాగారంలో ఖైదీలకు అన్ని విద్యల్లో ప్రావీణ్యం సంపాదించేలా డీజీ రాజీవ్‌త్రివేది సూచనలను పక్కాగా అమలు చేస్తున్నాం. శిక్ష అనంతరం బయటకు వెళ్లాక నేర ఆలోచన రాకుండా చేయడమే ప్రధాన లక్ష్యం.

-దశరథరామిరెడ్డి, వ్యవసాయక్షేత్ర పర్యవేక్షణాధికారి

ఇదీ చదవండి: 'మిల్లుల్లో తనిఖీలు వాయిదా వేయండి'- కేంద్రానికి రాష్ట్రం లేఖ

ABOUT THE AUTHOR

...view details