Police Caught Thieves in Medchal : డిగ్రీ చేసి జాబు కోసం ప్రయత్నించే యువతీ, యువకులను చూసి ఉంటాం. సొంతంగా వ్యాపారం పెట్టుకుని అభివృద్ధి చెందే వారిని చూశాం. కాని ఓ యువతీ, యువకులు ఇద్దరు దానికి భిన్నంగా డబ్బుల కోసం చోరీ చేయడానికి వెనకాడలేదు. వారి ఇద్దరు ఒంటరిగా ఉన్న ఒక వృద్దురాలి మెడలో బంగారాన్ని దోచేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వారిని పట్టుకుని రిమాండ్‌కి తరిలించారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని చెంగిచర్ల బాపూజీనగర్‌లో యాదమ్మ (55) టీస్టాల్ పెట్టుకుంది. దాని మీద ఆధారపడి జీవనం సాగిస్తోంది. ఈ నెల 5వ తేదీన ఆమె దుకాణానికి గుర్తు తెలియని వ్యక్తులు షాపులోని వస్తువులు కొనడానికి వచ్చారు. ఆమె వారు అడిగిన వస్తువులు ఇస్తుండగా.. నిందితులు వారితో తెచ్చుకున్న కారం పొడిని ఆమె కళ్లలో చల్లారు. దీంతో ఆమె కళ్లు కనిపించక అటు ఇటు తిరిగే లోపు.. వృద్ధురాలి మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసును నిందితులు లాక్కొని పారిపోయారు. కొంత సమయానికి ఆమె తేరుకుని స్థానికుల సాయంతో పోలీసులను ఆశ్రయించింది. స్థానిక పోలీస్ స్టేషన్లో యాదమ్మ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఘటన స్థలాన్ని నిశితంగా పరిశీలించారు. ఆ వీధి సమీపంలో ఉన్న సీసీ కెమెరాల ఉన్నాయని తెలుసుకున్న పోలీసులు.. వాటిని పరిశీలించారు. అందులో రికార్డు అయిన దృశ్యాలు ఆధారంగా.. ఉప్పల్ బీరప్ప గడ్డకు చెందిన నరేష్, మరొకరు అతని స్నేహితురాలిగా గుర్తించారు. వారిని బీరప్ప గడ్డ దగ్గర పట్టుకున్నట్లు మల్కాజిగిరి డీసీపీ జానకీ తెలిపారు. వారి దగ్గర నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.