Mynampally Hanmantha Rao Meet with Activists : తాను ఏ రాజకీయ పార్టీని దూషించనని.. ప్రాణం పోయే వరకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని మైనంపల్లి(Mynampally Hanmantharao) హన్మంతరావు పేర్కొన్నారు. మెదక్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో పర్యటించిన అనంతరం.. వారం రోజుల తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టం చేశారు. గతంలో తాను అమెరికా నుంచి భారత్ తిరిగొచ్చిన తర్వాత.. రాజకీయాల్లో చేరానని.. అప్పట్లో టీడీపీ మెదక్ జిల్లాలో అధ్యక్షుడిగా ఎనిమిది ఏళ్లు పని చేశానని గుర్తు చేశారు. మెదక్ జిల్లాలో రామాయంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచానని.. తనకు మెదక్ ప్రజలు రాజకీయ భిక్ష పెట్టారని తెలిపారు. ఆ తర్వాత తెలంగాణ కోసం టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరానని స్పష్టం చేశారు.
ఉద్యమంలో ప్రజలంతా కలిస్తే తెలంగాణ సాకారమైందని.. ప్రాణం పోయే వరకు మాటపైన ఉంటానని ప్రస్తావించారు. ఎవరైనా తన జోలికి వస్తే ఉపేక్షించనని హెచ్చరించారు. సాధారణంగా భారత్‌లో పోటీతత్వం ఉందని.. తన కుమారుడు రోహిత్ తన కంటే ఎక్కువగా సేవా సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాడని తెలిపారు. తాను, తన కుమారుడు బీఆర్ఎస్ సీట్లు ఆశించామని స్పష్టం చేశారు. తాము పార్టీని ఏమీ అనలేదని.. తనను కూడా బీఆర్ఎస్ ఏమీ అనలేదని అన్నారు. మల్కాజిగిరి, మెదక్ నియోజకవర్గాల్లో తన అనుచరులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను కలిసేందుకు ఆహ్వానించానని తెలిపారు. తన కుమారుడు మెదక్‌లో పర్యటించి ప్రజాభిప్రాయం కోరతాడని ప్రకటించారు.
అధిష్ఠానం అసహనం..: టికెట్ల ప్రకటనకు ముందు బీఆర్ఎస్ కీలక నేత మంత్రి హరీశ్‌రావుపై.. మైనంపల్లి తిరుమలలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తాజాగా బీఆర్ఎస్ ముఖ్య నేతలపై తీవ్ర పదజాలంతో మాట్లాడిన ఆడియో కూడా తాజాగా వైరల్ కావడం సంచలనం సృష్టిస్తోంది. తన కుమారుడు మైనంపల్లి రోహిత్‌కు మెదక్ టికెట్ ఇవ్వలేదని ఆగ్రహంతో ఉన్న హన్మంతరావుపై.. బీఆర్ఎస్ అధిష్టానం అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది.
Mynampally HanmanthaRao Latest News : మల్కాజిగిరిలో మైనంపల్లి, మెదక్‌లో ఆయన కుమారుడు రోహిత్‌కు టికెట్ ఆశించారు. కేసీఆర్ అసెంబ్లీ టికెట్లను ప్రకటించక ముందే మైనంపల్లి హన్మంతరావు తిరుమలలో బీఆర్ఎస్ కీలక నేత మంత్రి హరీశ్‌రావుపై విరుచుపడ్డారు. మెదక్ నియోజకవర్గంలో హరీశ్‌రావు పెత్తనమేంటని ప్రశ్నించారు. హరీశ్‌రావుపై.. మైనంపల్లి వ్యాఖ్యలను అదే రోజున కేటీఆర్, కవిత ట్వీట్టర్ ద్వారా ఖండించారు.
కుమారుడికి టికెట్ ఇవ్వకపోతే తాను పోటీ చేయనంటున్నారని విలేకరులు ప్రస్తావించగా.. చేస్తే చేయనీయి లేకుంటే లేదంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అసహనం వ్యక్తం చేశారు. ఆ తర్వాత పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా మైనంపల్లిని విమర్శిస్తూ మీడియా ప్రకటనలు చేశారు. పార్టీలోని ముఖ్య నేతలందరూ స్పందించినందున.. మల్కాజిగిరిలో మైనంపల్లి టికెట్‌పై పునరాలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ మల్కాజిగిరి అభ్యర్థిగా మైనంపల్లి హన్మంతరావును మారిస్తే.. మంత్రి మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ ఇంఛార్జీ మర్రి రాజశేఖర్‌రెడ్డికి ఇవ్వొచ్చునని ఇప్పటికే పార్టీలో విస్తృత ప్రచారం జరుగుతోంది.