ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న మూడుచింతలపల్లిలో కోట్ల రూపాయల ప్రకటనలు తప్ప.. ఏమాత్రం అభివృద్ధి చేయలేదని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. ఆ గ్రామంలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్షలో భాగంగా రెండో రోజు రేవంత్రెడ్డి చేస్తున్న దీక్షలో ఆమె పాల్గొన్నారు.
దళితులు, గిరిజనులు, ఆదివాసీల సమస్యలు బయటకు తీసుకువచ్చేందుకే ఈ దండోర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు సీతక్క తెలిపారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలకు చైతన్యం తీసుకొచ్చేందుకే దీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన పది లక్షల రూపాయలు తీసుకుంటాం.. నచ్చినోళ్లకే ఓటేస్తామని హుజూరాబాద్ ప్రజలు చెబుతున్నారని సీతక్క తెలిపారు. హుజూరాబాద్ మాదిరిగానే బీసీ, ఎస్టీ, ఆదివాసీ, గిరిజనులు, మహిళలకు రాష్ట్ర సంపద పంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రమంతా అర్హులైన దళితులకు న్యాయం చేయాలనే రేవంత్రెడ్డి దీక్ష చేస్తున్నారని సీతక్క పేర్కొన్నారు. ఆదివాసీ హక్కుల కోసం, పోడు భూముల్లో మొక్కలు పెంచుతున్న ప్రభుత్వ విధానాలపై ఎండగట్టేందుకే రేవంత్రెడ్డి దీక్ష చేస్తున్నారని స్పష్టం చేశారు.