రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో తెరాసకు ఓటేస్తే దొంగకు తాళం చెవి ఇచ్చినట్టేనని దుయ్యబట్టారు మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి. మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు కూన శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియా, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
'రాష్ట్రంలో పుట్టబోయే బిడ్డ మీద కూడా అప్పుంది'
ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో పుట్టబోయే బిడ్డ మీద కూడా రూ. లక్ష పెట్టాడని ఆరోపించారు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు అందడం లేదని రేవంత్ మండిపడ్డారు. జవహర్ నగర్ నుంచి డంపింగ్ యార్డ్‌ను తరలించాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఎంపీ కోరారు. తెరాసకు ఓటు వేస్తే అవినీతికి తాళం ఇచ్చినట్టేనని వ్యాఖ్యానించారు. శాసనసభ ఎన్నికల్లో జరిగిన తప్పిదాన్ని మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి సరిచేయాలని రేవంత్ సూచించారు. సీఎం రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిన ఖర్చంతా ఎవరి జేబుల్లోకి వెళ్లిందో చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పుట్టబోయే బిడ్డ మీద కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. లక్ష అప్పు పెట్టాడని ఆరోపించారు.