గోదావరి పరిధిలో మిగులు జలాలు ఆంధ్రప్రదేశ్ వాడుకుంటే తమకు అభ్యంతరం లేదని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. కృష్ణా పరిధిలోని నీటిని పెన్నా బేసిన్‌కు తరలిస్తామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. కృష్ణా జలాలపై హక్కులు వదులుకోబోమని వెల్లడించారు. తెలంగాణ నీళ్లు దోచుకుపోతే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. ఏపీ అక్రమ ప్రాజెక్టుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కఠినంగా వ్యవహరించనున్నారని... తెలంగాణ గడ్డకు అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోబోమని తెలిపారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పోచారం పురపాలిక పరిధిలోని నారపల్లిలో నూతనంగా నిర్మించిన ఘట్‌కేసర్ ఎక్సైజ్ స్టేషన్ భవనాన్ని మంత్రి మల్లారెడ్డితో కలిసి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకొని తీరుతాం. జలవనరుల విషయంలో చుక్క నీరు నష్టపోకుండా చర్యలు చేపడతాం. రాష్ట్రాన్ని కించపరిచేలా ఎవరైనా మాట్లాడితే పార్టీలకతీతంగా అందరూ ఏకతాటిపై నిలబడాలి. రాష్ట్రంలో కులవృత్తులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలుస్తున్నారు. గౌడ వృత్తిదారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని నీరా స్టాల్స్ ఏర్పాటు చేయబోతున్నాం. ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ తొలి నీరా స్టాల్ ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాం.
-శ్రీనివాస్ గౌడ్, ఎక్సైజ్ శాఖ మంత్రి
సర్వాయి పాపన్న ఆదర్శం
యాదాద్రి భువనగిరి జిల్లా వడాయిగూడెం గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ భావితరాలకు ఆదర్శమన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం మనందరం కృషి చేయాలని కోరారు. రాజకీయాలు ఎన్నికల సమయంలో మాట్లాడుకోవాలని... అన్యాయం జరిగినప్పుడు అందరూ ఐక్యంగా ఉండాలన్నారు. ఎంతో మంది ప్రాణ త్యాగం ఫలితంగా తెలంగాణ తెచ్చుకున్నామని గుర్తు చేశారు. యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహ స్వామిని మంత్రి దర్శించుకొని... ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వారికి ప్రత్యేక ఆశీర్వచనాలు చేశారు.