నగరపాలక సంస్థలో వరద నీటి కాలువ ఏర్పాటుకు మంత్రి కేటీఆర్ చొరవ చూపినందుకు మంత్రి మల్లారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. మేడ్చల్ జిల్లాలోని పీర్జాదిగూడ, బోడుప్పల్ నగరపాలక సంస్థలకు రూ.కోటి 10 లక్షల నిధులు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్ చిత్ర పటానికి మంత్రి మల్లారెడ్డి, మేయర్లు జక్కా వెంకట్ రెడ్డి, బుచ్చిరెడ్డిలు క్షీరాభిషేకం చేశారు. అనంతరం బోడుప్పల్ లో రూ.2.16 కోట్లతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
గతంలో ఎన్నడు లేని భారీవర్షాలకు కాలనీలు వర్షపు నీటిలో మునిగిపోయాయని మంత్రి తెలిపారు. వర్షాకాలంలో అనేక కాలనీలు జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆయన పేర్కొన్నారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ స్వయంగా వచ్చి పరిస్థితిని సమీక్షించారని మంత్రి చెప్పారు. అభివృద్ధి పనుల్లో మేడ్చల్ నియోజకవర్గం ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పని చేస్తున్నారని మంత్రి కొనియాడారు. నగర పాలక సంస్థలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని.. తన నియోజకవర్గంలో ఐటీ సంస్థలతో పాటు మరిన్ని వాణిజ్య సముదాయాలు రాబోతున్నాయని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు.