హైదరాబాద్ నగర విస్తీర్ణం పెరుగుతున్నందున.. బాహ్యవలయ రహదారి పక్కన ఉన్న శివారు మున్సిపాలిటీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ (Minister Ktr) పేర్కొన్నారు. నిర్దిష్టమైన ప్రణాళికలు రూపొందించాలని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డిని సీఎం కేసీఆర్ (Cm Kcr) ఇప్పటికే ఆదేశించారని కేటీఆర్ తెలిపారు.
జవహర్ నగర్ కార్పొరేషన్‌కు రాజకీయాలకతీతంగా ప్రత్యేక నిధులు కేటాయిస్తామని చెప్పారు. మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్‌నగర్‌లో నలుగురు కార్పొరేటర్లు, ఘట్కేసర్, తూంకుంట మున్సిపాలిటీల్లో ముగ్గురు కౌన్సిలర్లు, ఆలియాబాద్, పొన్నాల్, అలియాబాద్ ఎంపీటీసీలు తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ నుంచి తెరాసలో చేరారు. పదవులు రాగానే కొందరు కోతికి కొబ్బరికాయ దొరికినట్లు వ్యవహరిస్తున్నారని.. కేసీఆర్ ముందు అవన్నీ హన్మంతుడి ముందు కుప్పిగంతుల వంటివేనని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
ఎవరెన్ని మాట్లాడినా.. కుసంస్కారంగా ప్రవర్తించినా.. ప్రజలు పనిచేసే నాయకుడికి... పార్టీకి అండగా ఉంటారన్నారు. రాష్ట్రంలో ప్రజలు ముందు నుంచి తెరాసకు మద్దతుగా నిలుస్తున్నారని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అన్నారు. కాంగ్రెస్, భాజపాలకు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని.. ప్రాధాన్య రాష్ట్రం కాదన్నారు. తెరాసకు మాత్రం మొదటి, చివరి, ఏకైక ప్రాధాన్యత తెలంగాణేనన్నారు.