Matru Pujotsavam in Tiny Tots School: సృష్టిలో తల్లిని మించిన దైవం లేదు. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డలను మంచి మార్గంలో నడిపించడానికి మాతృమూర్తి పడే తపన మాటలకు అందనిది. అలాంటి అమ్మకు మాతృ పూజోత్సవం పేరిట ప్రత్యేకంగా పూజ చేయడం సాక్షాత్తు ఆ లక్ష్మీ, సరస్వతీ, దుర్గాదేవిలను పూజించినట్లే. ఈ అద్భుత ఘట్టానికి వేదికగా నిలిచింది కూకట్‌పల్లిలోని కేపీహెచ్‌బీ కాలనీ గోపాల్‌నగర్‌లో ఉన్న టైనీ టాట్స్ పాఠశాల.
పేగు తెంచుకొని పుట్టిన బిడ్డపై చెరగని ముద్ర వేసే కన్నతల్లి.. పిల్లల భవిష్యత్తులో వెలుగు నింపడానికి చేసే కృషి మాటల్లో చెప్పలేం. అందుకే అమ్మను దైవంతో సమానంగా చూస్తారు. ప్రస్తుత రోజుల్లో పరిస్థితులు మారిపోయాయి. ప్రత్యక్ష దైవాలుగా చూసే తల్లిదండ్రులను చాలామంది పట్టించుకోవడం మానేశారు. ఇలాంటి తరుణంలో భారతీయ సంస్కృతిని చిన్నతనం నుంచే అలవరచడానికి టైనీ టాట్స్ పాఠశాల యాజమాన్యం కృషి చేస్తోంది.
ఈ క్రమంలోనే తల్లిదండ్రుల గొప్పతనాన్ని ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు కథల రూపంలో చెబుతున్నారు ఇక్కడి ఉపాధ్యాయులు. అమ్మ దైవంతో ఎందుకు సమానమో వివరిస్తూ చిన్నారులతో మాతృపూజ చేయిస్తున్నారు. పిల్లలతో తల్లుల కాళ్లు కడిగించి పూలతో పూజలు చేయిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు తల్లుల విలువ తెలియజేయడమే తమ ఉద్దేశమని పాఠశాల యాజమాన్యం చెబుతోంది. చిన్నతనం నుంచి తమ పిల్లలకు విలువలు నేర్పించడం ఆనందంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు ఇలా నేర్పిస్తే.. భవిష్యత్తులో వాళ్లు ఉత్తమ పౌరులుగా తయారవుతారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.