మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నాగారంలో భవాని అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు.. భర్త గంగాధర్, అత్తమామలే భవానిని చంపి ఆత్మహత్యగా చెబుతున్నారంటూ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.
నాగారంలో నివాసం ఉంటున్న గంగాధర్‌కు భవానితో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వాళ్ల అన్యోన్య కాపురానికి గుర్తుగా ఇద్దరు పిల్లలూ పుట్టారు. అప్పటి వరకు బాగానే చూసుకున్న గంగాధర్.. అదనపు కట్నం తేవాలంటూ భవానిని హింసించడం మొదలుపెట్టాడు. తమ కొడుకు చేస్తున్న పని తప్పని చెప్పాల్సిన తల్లిదండ్లులు సైతం గంగాధర్‌కు వత్తాసు పలికారు. ఇచ్చిన కట్నం చాలదు.. అదనంగా కట్నం తీసుకురమ్మంటూ ముగ్గురూ భవానిని చిత్రహింసలకు గురిచేశారు. ఇవన్నీ తట్టుకోలేని భవాని తన పుట్టింటికి వెళ్లిపోయింది.
మళ్లీ అవే కష్టాలు..
తమ కూతురి కాపురాన్ని నిలబెట్టాలనుకున్న ఆ తల్లిదండ్రులు.. భవానికి ధైర్యం చెప్పి మళ్లీ కాపురానికి పంపించారు. మెట్టింటికి వచ్చిన భవానికీ మళ్లీ అవే కష్టాలు మొదలయ్యాయి. ఈ మధ్యే భవానిని చూడటానికి తమ తల్లిదండ్రులు వచ్చినా.. గేటు బయటే నిలబెట్టి మాట్లాడించి పంపించేశారు. వారితో ఫోన్లో మాట్లాడినా ఫోను లాగేసుకుంటూ తనను పూర్తిగా గృహ నిర్బంధం చేశారు. ఇవన్నీ తట్టుకోలేని భవాని.. శుక్రవారం ఇంట్లోని ఫ్యానుకి ఉరి వేసుకుని చనిపోయింది.