అధికారుల నోటీసులు చూసి.. గుండె ఆగి వ్యక్తి మృతి! - జగద్గిరి గుట్ట వార్తలు
అధికారులు పంపించిన నోటీసులు చూసి.. గుండె ఆగి ఓ వ్యక్తి చనిపోయిన ఘటన మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో చోటు చేసుకుంది. రాజీవ్ గృహకల్ప సముదాయంలోని కొందరు లబ్దిదారులు అదనంగా చేపట్టిన నిర్మాణాలు కూల్చేయాలని అధికారులు నోటీసులు పంపారు. ఆ నోటీసులు చూసి ఉద్వేగానికి లోనైన లబ్ధిదారుడు గుండె ఆగి చనిపోయాడు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని జగద్గిరిగుట్ట రాజీవ్ గృహకల్ప సముదాయంలో కొందరు లబ్ధిదారులు అదనంగా నిర్మాణాలు చేపట్టారు. వాటి కూల్చివేతలో భాగంగా జీహెచ్ఎంసీ అధికారులు అదనపు నిర్మాణాలు చేపట్టిన వారికి నోటీసులు పంపించారు. తాము కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చేస్తారేమోనని ఉద్వేగానికి లోనై.. 47వ బ్లాక్‌కి చెందిన రాములు అనే లబ్ధిదారుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటనతో లబ్ధిదారులంతా భావోద్వేగానికి లోనయ్యారు. తమకు న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించగా.. కొద్దిసేపు జగద్గిరిగుట్ట రాజీవ్ గృహకల్పలో ఉద్రిక్త వాతావారణం చోటు చేసుకుంది.