Land Of Love Art Exhibition: దేశంలో కళలకు ఆదరణ పెరుగుతోంది. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో అంతరిపోతున్న కళలు వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహిస్తూ.. వారిలో దాగి ఉన్న ప్రతిభను లోకానికి చాటిచెప్పే ప్రయత్నాలు సాగుతోన్నాయి. అందుకు ల్యాండ్ ఆఫ్ లవ్ అనే ఈ ప్రదేశం వేదికైంది. భిన్న నేపథ్యాల నుంచి వచ్చిన కళాకారులతో వైవిధ్యభరితంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి.
విశేషంగా ఆకట్టుకుంటున్నాయి: మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం కేశవరంలో ఉన్న ల్యాండ్ ఆఫ్ లవ్ వేదికపై చిత్ర కళా ప్రదర్శన జరుగుతోంది. కళలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కేపీసీ ఎస్టేట్స్ లిమిటెడ్.. సోల్ స్పేస్ సంస్థ ఆధ్వర్యంలో ఈ అప్డేటెడ్ స్టూడియోలో ఏర్పాటైంది. ఈ ప్రదర్శనలో ఔత్సాహిక యువ మహిళా కళాకారులు పాల్గొన్నారు. వారి అద్భుత కళారూపాలు అందరిని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఆ జిజ్ఞాసను వదులుకోలేక:ఎన్నో వర్ణాల్లో చక్కటి పెయింటింగ్స్ వేస్తూ ఆ రంగుల్లో తన జీవితం ప్రదర్శిస్తున్న ఈ యువతి పేరు స్వప్నిక కొవ్వాడ. స్వస్థలం శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం నాయిరోలవలస. చిన్నప్పుడు విద్యాదాఘాతానికి గురైన ఆమె రెండు చేతులు కోల్పోయింది. కానీ, పట్టుదల, ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఫలితంగా డిగ్రీ పూర్తి చేసి.. డ్రాయింగ్‌లో రాణిస్తుంది. ఆర్థికంగా ఎవరి నుంచి మద్దతు లేకపోయినా.. గురువంటూ లేకపోయినా కూడా ఆ జిజ్ఞాసను వదులుకోలేక నోటితో పెయింటింగ్స్ వేయడం మొదలు పెట్టింది.
ఫలితంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. హైదరాబాద్ వచ్చిన తర్వాత సోదరుడు నందకిషోర్.. తనను ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రముఖుల ప్రశంసలు, అభినందనలు అందుకుంటుంది ఈ కళాకారిణి. 2డీ ఫార్మేట్‌లో ఎన్నో రకాల చిత్రాలు గీసి ప్రదర్శిస్తున్న ఈమె పేరు శిరీష నిప్పట్ల. హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ కంపెనీలో సీనియర్ రిలియబిలిటీ ఇంజినీర్‌గా సేవలందిస్తున్నారు.