Minister HarishRao at CPR training program in Medchal: అప్పటిదాకా ఆడుతూపాడుతూ ఉన్నవారు క్షణంలో కుప్పకూలుతున్నారు. రెప్పపాటులోనే ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఏం జరిగిందో గుర్తించే లోపే ఊపిరి ఆగిపోతోంది. దీనికి కారణం సడన్ కార్డియక్ అరెస్ట్. దేశవ్యాప్తంగా 15 లక్షల మంది గుండెపోటు వల్ల చనిపోతున్నట్లు అధికారిక నివేదికలు స్పష్టం చేశాయి. కొవిడ్ తర్వాత ఈ ఘటనలు మరింత పెరిగాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కార్.. వైద్యారోగ్య శాఖ సహా పలు విభాగాలు, కమ్యూనిటీ వాలంటీర్లకు సీపీఆర్ ట్రైనింగ్ ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. శారీరక శ్రమ లేకపోవడం వల్లే అనేక రోగాలు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ మేడ్చల్‌లోని మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు సంయుక్తంగా కలిసి సీపీఆర్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారభించారు. ప్రస్తుత కాలంలో చాలామంది గుండెపోటుతో చనిపోతున్నారని ప్రజల ప్రాణాలు కాపాడాలనే లక్ష్యంతోనే సీపీఆర్ శిక్షణ తీసుకొచ్చామని కేటీఆర్ స్పష్టం చేశారు.
గుండెపోటు వల్ల రోజుకు సగటున 4 వేల మంది చనిపోతున్నారని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సీపీఆర్ శిక్షణ విజయవంతమైతే ఎంతోమంది ప్రాణాలు కాపాడవచ్చని చెప్పారు. సడెన్ కార్డియాక్ అరెస్టు చిన్న పెద్దా అని తేడా లేకుండా ఎప్పుడైనా, ఎవరికైనా వస్తుందన్నారు. తెలంగాణలో ఏడాదికి సుమారు 25,000ల మంది చనిపోతున్నారని అంచనా. సీపీఆర్‌తో 10 మందిలో ఐదుగురు బతికే అవకాశం ఉంటుందన్నారు.
ఇందులో భాగంగా ప్రతి జిల్లాకి 5 మాస్టర్ ట్రైనర్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో మాస్టర్ ట్రైనర్ వారానికి 300 మందికి ,సీపీఆర్ శిక్షణ ఇచ్చేలా కార్యక్రమాన్ని రూపొందించారు. గోల్డెన్అవర్లో ఈ చికిత్స చేసుకోవచ్చని స్పష్టం చేశారు. అందుకే ఈ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. దీనిలో అన్ని రంగాల వారిని, బస్తీ వాసులను, గేటెడ్ కమ్యూనిటీ వాసులను ఇందులో భాగస్వామ్యం చేస్తామని మంత్రి చెప్పారు.