Minister Mallareddy IT raids updates: రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి, అతడి కుటుంబీకులు, బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఐటీ అధికారులు సోదాలు చేస్తోన్న సమయంలో మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్రెడ్డి స్వల్ప అస్వస్థత గురైన సంగతి తెలిసిందే. ఛాతిలో నొప్పి రావడంతో ఆయనను తన కుటుంబ సభ్యులు వెంటనే సూరారంలోని ఆస్పత్రికి తరలించారు. మరోవైపు మల్లారెడ్డి మరదలి కుమారుడు సైతం అస్వస్థతకు గురికావడంతో... ఆసుపత్రిలో చికిత్స అందించారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను డిశ్చార్జ్ చేశారు.
అయితే తాజాగా బోయిన్‌పల్లిలోని మర్రి రాజశేఖర్‌రెడ్డి (మల్లారెడ్డి అల్లుడు) ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాల సమయంలో విదేశాల్లో ఉన్న మర్రి రాజశేఖర్‌రెడ్డి.. అక్కడి నుంచి బయలుదేరినట్లు సమాచారం. మర్రి రాజశేఖర్‌రెడ్డి కుమార్తెను (మల్లారెడ్డి మనవరాలు) కోఠిలోని బ్యాంకుకు అధికారులు తీసుకెళ్లారు. ఆర్థిక లావాదేవీలపై బ్యాంకు లాకర్ల పరిశీలనకు ఐటీ అధికారులు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇక మంత్రి మల్లారెడ్డి ఇంట్లో పనిమనిషి కూడా అస్వస్థత గురయ్యారు. మహిళకు ఫిట్స్ రావడంతో ఐటీ అధికారులు ఆసుపత్రికి తరలించారు.