IT employee Success in Snacks business: పండుగలొచ్చినా, చుట్టాలొచ్చినా ఇంటిల్లిపాది చేసుకునే పిండి వంటలు రానురాను తగ్గిపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో ఉద్యోగాలతో బిజీ అయ్యే నగరవాసులు.. పిండివంటలు చేసుకోవటం చాలా అరుదు. రిటైల్ స్టోర్లు, స్పెషల్ ఔట్ లెట్లలో కొనుక్కుని సరిపెట్టుకనే ఔత్సాహికుల కోసం.. ప్రత్యేకంగా మీకోసమే తయారు చేసిన పిండివంటలను మీ ఇంటివద్దకే అందిస్తామంటూ ప్రత్యేకత చాటుతున్నారు హైదరాబాద్‌కు చెందిన రాజేంద్రప్రసాద్. ఈ వ్యాపారం కోసం రెండు దశాబ్దాల పాటు మంచి జీతాన్నిచ్చే ఐటీ ఉద్యోగాన్ని సైతం వదులుకున్నారు. టీ స్నాక్స్ పేరుతో ఏడాదిన్నర కింద వ్యాపారాన్ని మొదలు పెట్టి.. పదిమంది మహిళలకు ఉపాధినందిస్తూ ముందుకు సాగుతున్నారు.
ఆహార పరిశ్రమపై ఉన్న పట్టుతో...
Snacks business: కూకట్‌పల్లికి చెందిన రాజేంద్రప్రసాద్ టాప్ ఐటీ కంపెనీలో మంచి వేతనంతో పనిచేస్తుండేవాడు. కానీ ఎక్కడో ఏదో వెలితి. స్వతహాగా ఆహార పరిశ్రమపై పట్టు ఉన్న ఆయన.. సొంతంగా వ్యాపారం పెట్టి నలుగురికి ఉపాధి అందించాలని సంకల్పించారు. అనుకున్నదే తడవుగా ప్రగతినగర్‌లో ఒక క్లౌడ్ కిచెన్‌ను అద్దెకు తీసుకొని.. టీస్నాక్స్ పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించారు. పిండివంటలు, కారపు పొడులు, పచ్చళ్లు వంటి వాటిని... అందులో సిద్ధహస్తులైన మహిళలతో చేయించి అమ్మకాలు జరుపుతున్నారు. ఆర్డర్లపై వీటిని తయారు చేసి డెలివరీ చేస్తున్నారు. మౌత్ పబ్లిసిటీతో క్రమంగా వ్యాపారం ఊపందుకుంది. ఇలా హైదరాబాద్‌తో పాటు.. బెంగళూరు, చెన్నై, ముంబయి, దిల్లీ వంటి మెట్రోనగరాలకు... యూఎస్, కెనడా, దుబాయ్ వంటి విదేశాలకు సైతం తన పిండి వంటలను కొరియర్ చేస్తున్నారు.
నాణ్యతలో రాజీ పడం...