తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్రమ రేషన్​ బియ్యం దందా గుట్టురట్టు

పేదల క్షుద్బాధను తీర్చేందుకు సర్కారు అందిస్తున్న బియ్యాన్ని  కొందరు కేటుగాళ్లు దారిమళ్లిస్తున్నారు. టన్నుల కొద్దీ బియ్యాన్ని అక్రమంగా తరలించి పేదల కడుపు కొడుతున్నారు. మేడ్చల్​ జిల్లాలో ఓ గోదాంలో అక్రమంగా నిల్వ ఉంచిన 50 టన్నుల బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు.

అక్రమ రేషన్​ బియ్యం దందా గుట్టురట్టు

By

Published : Jul 21, 2019, 11:52 PM IST

అక్రమ రేషన్​ బియ్యం దందా గుట్టురట్టు

పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం అందిస్తున్న రూపాయికే కిలో బియ్యం పథకం కొందరు అక్రమార్కులకు వరంగా మారింది. వ్యాపారుల దగ్గర నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి పొరుగు రాష్ట్రాలకు తరలిస్తూ యథేచ్ఛగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. మేడ్చల్​ జిల్లా మేడిపల్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలోని హేమానగర్​లో ఓ గోదాంలో నిల్వ ఉంచిన 50 టన్నుల రేషన్​ బియ్యాన్ని రాచకొండ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. 600 బస్తాలతో పాటు, ఓ లారీని సీజ్​ చేశారు.

డీలర్లతో కుమ్మక్కై అక్రమ దందా

గత రెండు నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా ఓ వ్యక్తి రేషన్​ డీలర్లు, కార్డు లబ్ధిదారుల నుంచి కేజీ రూ. 10 నుంచి 13కు కొనుగోలు చేసి ఈ గోదాములో నిల్వ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. విశ్వసనీయ సమాచారంతో దాడిచేసిన పోలీసులు బియ్యాన్ని, లారీని పట్టుకున్నారు. వాటిని గుట్టు చప్పుడు కాకుండా మహారాష్ట్రకు తరిలించే ఏర్పాట్లు చేస్తున్నారని అధికారులు తెలిపారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని, గోదాములో పనిచేసే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వివరించారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులకు అప్పగించామన్నారు.
ఇదీ చూడండి: పక్కదారి పడుతున్న ప్రజాపంపిణీ వ్యవస్థ

ABOUT THE AUTHOR

...view details