గ్రేటర్ హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఇంతా అంతా కాదు. ఉదయం, సాయంత్రం వేళల్లో మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రధాన ప్రాంతాల్లో అయితే గంటల వరకు ట్రాఫిక్‌లో చిక్కుకోవాల్సిన దుస్థితి. ఇలాంటి ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఎస్ఆర్డీపీలో (Strategic Road Development Plan) భాగంగా జంట నగరాల్లో పలు ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మిస్తోంది. దాంతో పాటు ఇటూ లింక్ రోడ్లను నిర్మించి ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ తగ్గిస్తోంది. ఇప్పటికే ఇందులో చాలా వరకు నిర్మాణాలు పూర్తై ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.
ఇవాళ్టి నుంచి బాలానగర్ ఫ్లైఓవర్ వినియోగంలోకి రానుంది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ పైవంతెనను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి పాల్గొననున్నారు.
బాలానగర్ ట్రాఫిక్ దాటితే చాలు..
బాలానగర్ డివిజన్‌లోని నర్సాపూర్ చౌరస్తా... రద్దీగా ఉండే నాలుగు రోడ్ల కూడలి. కూకట్‌పల్లి, సికింద్రాబాద్, జీడిమెట్ల వెళ్లే రహదారి పారిశ్రామిక కేంద్రం కావటంతో నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. బాలానగర్‌లో ట్రాఫిక్ దాటితే చాలు అని వాహనదారులు అనుకోని రోజు ఉండదు. ఇక్కడ కష్టాలు అలాంటివి మరి. ఇలాంటి ట్రాఫిక్ అవస్థలకు చెక్ పెట్టేందుకు ఈ పైవంతెనను నిర్మించారు.