మెదక్ జిల్లా గ్రామీణ ప్రాంతాల్లోనూ కేసులు వెలుగు చూస్తున్నాయి. జిల్లాలో ఐదు మండలాల పరిధిలో కేసుల సంఖ్య రెండు వారాలుగా రెట్టింపవుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎక్కడికక్కడ కంటెయిన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేసి కట్టడి చేయాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవడంలేదు. జిల్లాలో ఒక్క కంటెయిన్‌మెంట్ జోన్ లేదని ప్రభుత్వ బులిటెన్ వెల్లడిస్తోంది.
మేడ్చల్ జిల్లాలో 79 కేంద్రాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. 67 పరీక్ష కేంద్రాలు జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉండగా, మరో 12 కేంద్రాలు మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. రోజూ చేస్తున్న పరీక్షల్లో 20 శాతం మేర పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. వీరందరినీ ఇంట్లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఘట్‌కేసర్‌లో 30 పడకలతో కొవిడ్ ఆసుపత్రి ఏర్పాటు చేసినా.. ఒక్కరూ చేరలేదు. హోం ఐసోలేషన్‌లో చికిత్స అందిస్తున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. ఇలాంటి ఇళ్లను కంటెయిన్‌మెంట్‌గా చేసి రాకపోకలు నియంత్రిస్తున్నారు. ఒకేచోట 5 అంత కంటే ఎక్కువ కేసులు వస్తే వీధిని కంటెయిన్‌మెంట్ ప్రాంతంగా మారుస్తున్నారు. కానీ విచిత్రంగా మేడ్చల్ జిల్లాలో పదుల సంఖ్యలో నిత్యం కేసులు వెలుగు చూస్తున్నా, ఒక్క కంటెయిన్‌మెంట్ జోన్ లేదని ప్రకటిస్తున్నారు. ఎవరైనా వ్యక్తికి పాజిటివ్ అని తెలిస్తే 17 రోజులపాటు ఐసోలేషన్ ఉండాలని ఐసీఎంఆర్ నిబంధనలు సూచిస్తున్నాయి. అప్పటివరకు ఆ ఇల్లు లేదా వీధి కంటెయిన్‌మెంట్‌గా ఉండాలి. ఆ విధంగా చేయకపోవడంతో పాజిటివ్ వచ్చిన వ్యక్తులు బయట తిరిగే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.