Four years Girl Kidnapped in Ghatkesar :మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో కలకలం సృష్టించిన నాలుగేళ్ల బాలిక కిడ్నాప్ కథ సుఖాంతమైంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫామ్ ఒకటి వద్ద నిందితుడు సురేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రాత్రి చిన్నారిని కిడ్నాప్ చేసిన నిందితుడు.. ఉదయం పాపను తీసుకుని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వచ్చాడు. అప్పటికే చిన్నారి తల్లిదండ్రులు ఠాణాలో ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్న క్రమంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో సురేశ్ అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అదుపులోకి తీసుకున్నారు. పాపతో పాటు నిందితుడిని స్టేషన్‌కు తరలించారు. అనంతరం చిన్నారి తల్లిదండ్రులకు సమాచారం అందించి.. సురక్షితంగా వారికి అప్పగించారు. గంటల్లోనే తమ బిడ్డను తమ వద్దకు చేర్చినందుకు బాధితులు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.
అసలు ఏం అయిందంటే..: ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి కిడ్నాప్ కలకలంసృష్టించింది. ఇంటి సమీపంలో ఆరుబయట ఆడుకుంటున్న బాలిక కృష్ణవేణిని సురేశ్ (సూరీ) అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. నిన్న రాత్రి 8 గంటల సమయంలో సురేశ్ చిన్నారి ఇంటి సమీపంలో కూర్చుని ఉన్నాడు. అతడిని గమనించిన పాప తల్లి, నానమ్మ.. ఇక్కడెందుకు కూర్చున్నావంటూ సురేశ్‌ను ప్రశ్నించారు. ఊరికే కూర్చున్నా అంటూ దాదాపు 20 నిమిషాల పాటు అక్కడే తచ్చాడాడు. అనంతరం పాప కుటుంబసభ్యులు ఇంట్లోకి వెళ్లగానే.. కృష్ణవేణిని అపహరించి అక్కడి నుంచి పరారయ్యాడు. కాసేపటి తర్వాత చిన్నారి కనిపించకపోవడంతో పక్కింట్లో ఉందేమోలే అనుకున్నారు.