Four Years Girl Kidnapping in Medchal : మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లోని ఈడబ్ల్యూఎస్ కాలనీలో భరత్, రాజేశ్వరి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి నాలుగేళ్ల చిన్నారి కృష్ణవేణి ఉంది. భరత్ స్థానికంగా పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. రాజేశ్వరి ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణి. బుధవారం రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో కృష్ణవేణి ఇంటి ప్రక్కనే ఉన్న దుకాణానికి వెళ్లింది. అక్కడ తినుబండారాలు కొనుక్కుని ఎదురుగా ఉన్న మైదానంలో ఆడుకుంటుంది. కొద్దిసేపటి తరువాత బాలిక అక్కడ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు గాలించారు.
ఫలితం లేకపోవడంతో రాత్రి 9.30గంటల ప్రాంతంలో డయల్ 100కి కాల్ చేశారు. విషయం తెలుసుకున్న ఘట్‌కేసర్ పోలీసులు బాలిక ఇంటికి వచ్చారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలిక కోసం గాలించారు. ఘట్‌కేసర్ ప్రధాన రహదారి, రైల్వే ట్రాక్ వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఇదే క్రమంలో ఓ వ్యక్తి బాలికను తీసుకువెళ్తున్నట్లు గుర్తించారు. స్థానికులను అడిగి ఆ వ్యక్తి సురేష్‌గా నిర్ధారించారు. అతను జగదాంబ సినిమా థియేటర్‌లో పని చేస్తున్నట్లు తెలుసుకున్నారు. బాలికను తీసుకెళ్లిన వ్యక్తి కోసం గాలించేందుకు ఘట్‌కేసర్‌లోని యువత స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.
సుమారు 200 మంది యువకులు రాత్రి మూడింటి వరకూ గాలించారు. యువకులు గాలించేందుకు రియాజ్ అనే స్థానికుడు సుమారు 50 ద్విచక్ర వాహనాలకు పెట్రోల్ పోయించి తన మానవత్వాన్ని చాటాడు. దీంతో బీబీనగర్, ఘట్‌కేసర్, ఏదులాబాద్ తదితర ప్రాంతాలు, సర్వీసు రోడ్డులు, వెంచర్లు మొత్తం యువకులు, పోలీసులు కలిసి గాలించారు. ఉదయం డాగ్ స్క్వాడ్ సైతం రంగంలోకి దిగింది. స్థానికంగా ఉన్న గురుకుల పాఠశాల మైదానం, పరిసర ప్రాంతాలు జల్లెడ పట్టారు. సురేష్ ఫోన్ నంబర్ కోసం ప్రయత్నించగా అతని ఫోన్ స్విచ్‌ఆఫ్ వచ్చింది.
గతంలోనూ నిందితుడు బాలురులను తీసుకెళ్లాడు : సురేష్ తల్లి కొన్నేళ్ల క్రితం మరణించగా ఇటీవల తండ్రి కూడా మరణించాడు. అప్పటి నుంచి మద్యానికి బానిసైన ఆయన.. ఒక్కోసారి విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. గతంలో కాలనీల్లో బాలురని తీసుకువెళ్లాడని స్థానికులు తెలిపారు. గత రాత్రి బాలిక ఇంటి సమీపంలోనే ఉన్నాడని.. బాలిక ఇంటి ముందు అతను తర్చాడాడని చెప్పారు. మరో వైపు పాపను క్షేమంగా తీసుకువచ్చేందుకు పోలీసులు ఆరు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశారు. నిందితుడు రైల్వే స్టేషన్ వైపు వెళ్లాడని సీసీటీవీ ఫుటేజ్‌లో గమనించారు. ముందస్తుగా గుంటూరు, మిర్యాలగూడ, కాజీపేటకు బృందాలను పంపారు.