Ganjaa Smugling gang arrest in Telangana : ముందు ఎస్కార్ట్ కార్.. ఆ కారు సమాచారం ప్రకారం వెనకాలే మరో కారులో గంజాయి రవాణా.. ఇదీ స్మగ్లర్ల కొత్త ఎత్తుగడ. సులభంగా డబ్బు సంపాదించడం కోసం ముఠాగా ఏర్పడి.. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులను మాదాపూర్ ఎస్ఓటి, కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. వీరు ఆంధ్రప్రదేశ్‌లోని మారెడుమిల్లి నుంచి జహీరాబాద్‌కు తరలిస్తున్న 230 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కిషన్‌బాగ్‌కు చెందిన అఖిల్.. మెదక్ జిల్లా కోహిర్ గ్రామంలో కోళ్లఫారంలో పని చేస్తుంటాడు. గంజాయి తరలించటం, విక్రయించడం చేస్తూ, గంజాయి విక్రయదారులకు మధ్యవర్తిత్వం వహిస్తాడు. మియాపూర్‌కు చెందిన షేక్ అలావుద్దీన్, హౌడేకర్ విజయ్, వహీద్, అజిత్, వంశీలు.. ఈ ఐదుగురు కలిసి ఓ ముఠాగా ఏర్పడి, పెద్దమొత్తంలో గంజాయి స్మగ్లింగ్‌కు పథకం వేశారు.
వీరు ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లిలో వంటల రఘురాం అనే వ్యక్తి దగ్గర 230 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. స్మగ్లింగ్ చేస్తూ పోలీసుల కంట పడకుండా ఉండేందుకు.. కారులో వంశీ, విజయ్‌లు ఇద్దరు ఎస్కార్ట్ వాహనంలాగా ముందు వెళ్లేవారు. వారి వెనకాలే మిగతా వారు గంజాయితో ఉన్న కారులో వెళ్లేవారు. ఎక్కడైనా పోలీసుల తనిఖీలు ఉంటే.. వంశీ, విజయ్‌లు వెనకాల గంజాయి కారులో ఉన్న అల్లావుద్దీన్, వహీద్లకు సమాచారం అందించేవారు.