పేదలకు పక్కా గృహమే లక్ష్యంగా ఆ యువతి తన లక్ష్యం వైపు అడుగులు వేసింది. బస్టాండ్లు, ఫుట్‌పాత్‌లపై జీవనం సాగించే వారి దుస్థితి చూసి చలించిపోయింది. తక్కువ ఖర్చుతో నివాసయోగ్యంగా ఉండే ఓ గూడును నిర్మిస్తే బాగుంటుందని తలచింది. 6 నెలల కష్టం కళ్ల ముందే సాక్షాత్కరించింది. ఆమే కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని పేరాల మానసారెడ్డి.
కృషి.. పట్టుదలే లక్ష్యంగా..
గతేడాది పంజాబ్‌లోని లవ్‌లీ యూనివర్సిటీలో బీటెక్ ముగించుకొని నగరానికి వచ్చిన ఆమె బోడుప్పల్ నగర పాలక సంస్థలోని.. చెంగిచర్ల క్రాంతి కాలనీలోని బాబాయి ఇంటికి చేరింది. తను చేయాలనుకుంటున్న ప్రాజెక్టు గురించి బాబాయికి చెప్పడంతో తనకున్న ఖాళీ స్థలాన్ని ఇచ్చారు. 20వేల మిల్లీ మీటర్ల వ్యాసార్థం గల పైపులైనునే ఇంటిగా మార్చింది. 120 అడుగుల విస్తీర్ణమున్న ఓపడక గదిని సిద్ధం చేసింది. అందులో వంటగది, శౌచాలయం, బెడ్‌రూంతో పాటు సిట్టింగ్ ఏరియాను రూపొందించింది.అందుకు రూ.4 లక్షలు ఖర్చు అయినట్లు చెప్పారు. 5 మీటర్ల పొడవు, 10 అడుగుల వెడల్పుతో అద్భుత నిర్మాణం చేపట్టొచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వానికి కేవలం రూ.3.5 లక్షలకే నిర్మించేందుకు తాము సిద్ధమని పేర్కొన్నారు.