Election Fight in Malkajgiri Constituency : మల్కాజిగిరి శాసనసభ నియోజకవర్గం.. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. నాలుగు లక్షల 89 వేల 43 మంది ఓటర్లు.. ఈసారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వారిలో 44 శాతం యువత. మల్కాజిగిరిలో 33 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి మర్రి రాజశేఖర్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు, బీజేపీ తరఫున రాంచందర్‌రావు.. హోరాహోరీ తలపడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మైనంపల్లి.. తన కుమారుడు రోహిత్‌రావుకు మెదక్ టిక్కెట్ ఇవ్వలేదని అసంతృప్తితో బీఆర్ఎస్ను వీడి.. హస్తం పార్టీలో చేరారు. మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డిని బీఆర్ఎస్ బరిలోకి దించింది. బీజేపీ నుంచి 2014, 2018 ఎన్నికల్లో ఓటమి చవిచూసిన రాంచంద్రావు.. ఈసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
Telangana Assembly Elections 2023 : మౌలాలి డివిజన్‌లో ముస్లిం ఓట్లు 51 వేల వరకు ఉంటాయి. సైనికులకు శిక్షణ అందించే ఆర్మీ ఆర్డినెన్స్ కాప్స్-ఏఓసీ ఈ నియోజకవర్గంలోని సఫిల్‌గూడలో ఉండటంతో.. అనేక మంది సైనికోద్యోగులు అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. 70 వేల మంది రక్షణ శాఖ ఉద్యోగుల ఓట్లు ఉన్నాయి. మధ్యప్రదేశ్, గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడు నుంచి వ్యాపార నిమిత్తం వచ్చిన వారు అధికసంఖ్యలో ఉన్నారు. యాప్రాల్ ప్రాంతంలో తమిళుల ఓట్లు 75 వేల వరకు ఉంటాయి. ఆర్కేనగర్, ఆనంద్‌భాగ్ వంటి ప్రాంతాల్లో బ్రాహ్మణుల ఓట్లు 65 వేల ఉంటాయని అంచనా. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నవారు 50 వేల పైచిలుకు మంది ఉన్నారు. నియోజకవర్గంలో కీలకంగా ఉన్న వీరంతా.. మాల్కాజిగిరిలో గెలుపొటములపై ప్రభావం చూపిస్తారు.
గెలుపు కోసం హోరాహోరీగా ప్రచారం - ఇంటింటికి తిరుగుతూ అభ్యర్థుల ఓట్ల వేట
మల్కాజిగిరి నియోజకవర్గంలో అనేక సమస్యలు తాండవిస్తున్నాయి. ఈస్ట్ ఆనంద్‌బాగ్, షిరిడీనగర్, ఎన్ఎండీసీ కాలనీ, దీన్‌దయాళ్‌నగర్, పటేల్‌నగర్, దుర్గానగర్.. వర్షకాలంలో ముంపుసమస్యను ఎదుర్కొంటున్నాయి. దీన్‌దయాళ్‌నగర్‌లో 9 ఏళ్ల చిన్నారి సుమేధ.. నాళాలో పడి కొట్టుకుపోయిన ఘటన స్థానికుల్లో తీవ్ర విషాదం నింపింది. రైల్వే అండర్ బ్రిడ్జిలు చిన్నవిగా ఉండడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నియోజకవర్గంలో డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉంది.