డ్రంక్ అండ్ డ్రైవ్‌పై మరింత కఠినంగా వ్యవహారిస్తామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. తనిఖీల్లో ఉన్న సిబ్బంది భద్రత విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామని సజ్జనార్ తెలిపారు. ఈనెల 27న నిజాంపేట డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో గాయపడిన హోంగార్డు కేసులో దర్యాప్తుకు వెళ్లిన ఏఎస్ఐ మహిపాల్ రెడ్డిని ఓ క్యాబ్ డ్రైవర్ ఢీకొట్టాడు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతి చెందారు. కుటుంబసభ్యులు అతని అవయవాలను దానం చేశారు. అనంతరం రాజేంద్రనగర్ కిస్మత్‌పూర్‌లోని ఆయన స్వగృహానికి పార్థివ దేహాన్ని తరలించారు. ఏఎస్ఐ అంత్యక్రియలకు సజ్జనార్‌తోపాటు పలువురు పోలీసు అధికారులు, మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరై బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు.
ఏఎస్‌ఐ మహిపాల్ రెడ్డి ఘటనతో వెనకడుగు వేసేది లేదు. మహిపాల్ రెడ్డి స్ఫూర్తిగా మరింత ఉత్సాహంగా పని చేస్తాం. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో కచ్చితంగా వ్యవహరిస్తాం. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లోని సిబ్బంది భద్రతకు చర్యలు చేపడతాం. ఏఎస్‌ఐ మహిపాల్ రెడ్డి తన అవయవాలను దానం చేసి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు.