Today Cyber Crime News: మేడ్చల్ జిల్లాలోని జీడిమెట్ల పరిధిలో సయ్యద్ భాషా కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. ఓ ప్రైవేటు సంస్థలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవలే సయ్యద్ ఆరునెలల ఈఎంఐ పద్ధతిలో ఓ ఫోన్ కోనుగోలు చేశాడు. కానీ అతనికి 9నెలల పాటు ఈఎంఐ కట్టాలని సందేశం వచ్చింది.
యాప్‌ను ఇన్స్టాల్ చేయమని..
దాని గురించి తెలుసుకునేందుకు క్రెడిట్ కార్డు వినియోగదారుల సేవా కేంద్రం నెంబర్ కోసం అంతర్జాలంలో అన్వేషించాడు. చివరకు ఓ వెబ్సైట్లో వచ్చిన ఫోన్ నెంబర్‌కు ఫోన్ చేశాడు. అతను ఎదుర్కొంటున్న సమస్యను వారికి వివరించాడు. మీ సమస్యను క్షణాల్లో పరిష్కరిస్తామని అక్కడి నుంచి బదులు వచ్చింది. దీని కోసం కొన్ని సూచనలు పాటించాలని సయ్యద్‌కు తెలిపారు. దానికి ఇతను అంగీకరించడంతో ఫోన్లో క్విక్ సపోర్ట్ యాప్‌ను ఇన్స్టాల్ చేయించారు. దాని ఆధారంగా సయ్యద్ ఫోన్‌ను వారి ఆధీనంలోకి తీసుకున్నారు. వెంటనే సయ్యద్ ఎస్బీఐ బ్యాంకు ఖాతా, క్రెడిట్ కార్డు, ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాల నుంచి పలు దఫాలుగా రూ. 1,25,700 నగదు బదిలీ అయినట్లు గుర్తించాడు. మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ బాలరాజు వెల్లడించారు.