మేడ్చల్ జిల్లా పేట్‌బషీరాబాద్ ప్రాంతానికి చెందిన వ్యక్తి (64), అల్వాల్‌కు చెందిన వ్యక్తి (48) శుక్రవారం కొవిడ్‌తో గాంధీలో మృతి చెందారు. ఆ ఆసుపత్రి పరిధిలో వచ్చే మృతుల పోస్ట్‌మార్టం సైతం ఉస్మానియా మార్చురీలోనే నిర్వహిస్తున్నారు. శుక్రవారం పోస్ట్‌మార్టం అనంతరం అల్వాల్‌కు చెందిన వ్యక్తి మృతదేహాన్ని దూరం నుంచి చూసిన పేట్‌బషీరాబాద్ వారు.. తమ కుటుంబ సభ్యుడిది అనుకొని తీసుకెళ్లి ఎర్రగడ్డలో దహన సంస్కారాలు పూర్తి చేశారు.
శనివారం అల్వాల్ మృతుడి అసలు కుటుంబీకులు వచ్చి మృతదేహం కనిపించకుండా పోవడంతో ఆందోళనకు గురయ్యారు. పోలీసులు పేట్‌బషీరాబాద్ వారిని పిలిపించారు. వారు వచ్చి మృతదేహం తాలుకూ ఫొటో చూపెట్టడంతో అల్వాల్ వారు ఇది తమ కుటుంబీకుడిదిగా గుర్తించారు. పేట్‌బషీరాబాద్ వారు పొరపడినట్లు తెలుసుకున్నారు. అఫ్జల్‌గంజ్ పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను సముదాయించడంతో వివాదం సద్దుమణిగింది.